- రూ.1,500కే ఏడాది టోల్ పాస్ ..
- నవంబర్ 1 నుంచి అమలు
- టోల్ ప్లాజాలకు 20 కి.మీ. పరిధిలో ఉండేవాళ్లకే
న్యూఢిల్లీ: టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ప్లాజాకు 20 కి.మీల పరిధిలోని నాన్ కమర్షియల్ వాహనదారుల కోసం వార్షిక పాస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ఫాస్టాగ్ యానువల్ పాస్’ విధానంలో పలు కీలక మార్పులు చేస్తూ నూతన మార్గదర్శకాలతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. టోల్ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి రెండు రకాల వార్షిక రుసుములను నిర్ణయించారు.
మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధి వెలుపల ఉండే వాహన యజమానులు సంవత్సరానికి రూ .1,500 చెల్లించాలి. అలాగే మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ పరిధి లోపల ఉంటే ఏడాదికి రూ.3,000 రుసుముతో ఈ స్థానిక వార్షిక పాస్‌ను పొందవచ్చు. ఈ రాయితీ రేట్లను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమీక్షించి సవరించే అవకాశం ఉంటుంది. అయితే, సర్వీస్ రోడ్డు ఉంటే ఈ పాస్ వర్తించదు. ప్రస్తుతం నెలకు రూ. 360 చొప్పున ఏడాదికి రూ.4,320 ఖర్చవుతుండగా, ఈ కొత్త నిబంధన వల్ల అర్హులైన స్థానిక ప్రయాణికులకు ఏటా గణనీయంగా ఆదా కానుంది.
కొత్త టోల్పాస్కు అర్హతలేంటి?
టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో స్థిర నివాసం కలిగి ఉండాలి. కేవలం సొంత/కమర్షియేలేతర వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాహనానికి కచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఫంక్షనల్ ఫాస్టాగ్ఉండాలి. క్లోజ్డ్ టోల్ వసూలు విధానం అమలులో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలు, నేషనల్ హైవేలపై ఈ పాస్ వర్తించదు.
