రోబోలకు కొలువు.. మనిషికి ఉద్వాసన..బిల్‌‌‌‌గేట్స్ సంచలన కామెంట్స్‌‌ 

రోబోలకు కొలువు.. మనిషికి ఉద్వాసన..బిల్‌‌‌‌గేట్స్ సంచలన కామెంట్స్‌‌ 
  • ఆ వెనువెంటనే 60 వేల మందికి బై ఔట్ ఆఫర్!
  • భారత్ సహా 4 దేశాల్లోని సిబ్బందికి 
  • వాలంటరీ ఎగ్జిట్ చాన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ‘రోబోలను కొలువులో పెట్టుకోవడం.. మనుషులను గెంటేసి వెనుదిరిగి చూడకపోవడం.. ఇదీ నేటి ట్రెండ్!’’ అంటూ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. విచిత్రం ఏమిటంటే.. ఆయన ఆ మాట అని 24 గంటలు కూడా గడవకముందే, ఆయన సొంత సంస్థ మైక్రోసాఫ్ట్ ఏకంగా 60 వేల మంది ఉద్యోగుల చేతికి ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ (బై ఔట్) ఆఫర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేసింది!. ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌(ఏఐ) భూమ్మీద మనిషి తెలివితేటలకే ఎసరు పెడుతోందని ‘ది అబ్జర్వర్’ ఇంటర్వ్యూలో గేట్స్ చెప్పారు. 

వైట్​కాలర్ నుంచి మొదలై బ్లూ కాలర్ దాకా అన్ని ఉద్యోగాలనూ మింగేస్తుందని, ఉద్యోగాలు తగ్గితే ప్రభుత్వాల పన్ను రాబడి పడిపోయి సమాజం సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు. ఏఐ వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ వేయాలని, అవసరమైతే తానే 40 బిలియన్​ డాలర్ల (రూ.3.8 లక్షల కోట్లు) పన్ను కడతానని పేర్కొన్నారు. కాగా, గేట్స్‌‌‌‌ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మైక్రోసాఫ్ట్ తన మొత్తం సిబ్బందిలో ఏకంగా నాలుగో వంతు మందికి వలంటరీ ఎగ్జిట్ ఆఫర్ తెరిచింది. అమెరికా, బ్రిటన్, కెనడాలతోపాటు భారత్‌‌‌‌లోని టెకీలకూ ఈ ‘ఆఫర్’ వర్తిస్తుంది. చేసిన సర్వీస్‌‌‌‌ను బట్టి వారాల వేతనం, స్టాక్ వెస్టింగ్, హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌తో డిసెంబర్ తొలి వారంలోగా తేల్చుకోవాలని గడువు పెట్టింది. 

పైకి ఏఐ వల్లే ఈ కోతలు కావని యాజమాన్యం బుకాయిస్తున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చేస్తున్న వేల కోట్ల ఖర్చులను సర్దుబాటు చేయడానికే ‘హ్యూమన్ క్యాపిటల్’ను పక్కన పెడుతున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. అటు గేట్స్​ వ్యాఖ్యలు.. ఇటు మైక్రోసాఫ్ట్ చర్యలు ప్రపంచ ఐటీకి వెన్నెముకగా నిలిచిన భారతీయ ఇంజనీర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.