- విదేశీ నిధులతో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు
- నవంబర్ 2, 5 తేదీల్లో ర్యాలీలు
- పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు
కరీంనగర్, వెలుగు: బంగ్లాదేశ్ తరహాలో పార్లమెంట్, ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, విదేశీ నిధులతో విధ్వంసానికి పావులు కదుపుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అలాంటి ఆరాచక శక్తుల చెంప చెల్లుమనేలా దేశ పౌరులంతా సంఘటితం కావాలని సూచించారు. నవంబర్ 2న హైదరాబాద్లో, 5న కరీంనగర్లో 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహించే మహా ర్యాలీకి అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం పెద్దపల్లిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుధాకర్ జీ తల్లి కుమ్మరికుంట రాజేశ్వరి ఇటీవల మరణించగా, ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ఓటర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోయి ఏండ్లు దాటినా ఇంకా ఓటర్ జాబితాలో ఆయన పేరుందని గుర్తుచేశారు.
అక్రమ ఓటర్లను తొలగిస్తే తప్పేముంది?
విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఓటర్లుగా నమోదైన రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్లో రోహింగ్యాల ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరంలో బీఆర్ఎస్, పాతబస్తీలో మజ్లిస్ సైతం రోహింగ్యాలు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి ఓట్లతోనే గెలుస్తున్నాయని తెలిపారు.
విపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు వచ్చే నెల 2న హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల 5న కరీంనగర్లో 'లోక్ తంత్ర బచావో.. అరాచకత హఠావో' పేరుతో మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీరెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
