కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణ గట్టెక్కుతది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణ గట్టెక్కుతది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • ఆయన్ను సీఎం చేయాలని జనం ఎదురు చూస్తుండ్రు
  • ఇది దేవుడు తెచ్చిన కరువు కాదు
  • కాళేశ్వరం పంపులు ఆన్ చేయక ఎండబెడుతుండ్రు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ అన్నారు.  ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే తెలంగాణ  గట్టెక్కుతుందని, కేసీఆర్ పాలనలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తిరిగి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు దేవుడో, ప్రకృతో తెచ్చినవి కావని.. ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తెచ్చిపెట్టిన కృత్రిమ కరువు అని విమర్శించారు.

నదుల్లో పుష్కలంగా నీళ్లు పారుతున్నా ఒడిసిపట్టకుండా సముద్రం పాలు చేస్తూ, పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలను కళ్లముందే ఎండబెడుతున్నారన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌ మాట్లాడుతూ.. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ రోజులు నూకలు లేవని, మరో ఏడాదిలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని పేర్కొన్నారు. 

నీళ్లు సముద్రం పాలు.. ఎండిపోయిన చేలు
తెలంగాణలో నీటి నిర్వహణలో ప్రభుత్వం  విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల్లో  నీళ్లున్నా వాటిని సాగుకు మళ్లించడంలో సర్కారు చేతులెత్తేసిందని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతున్నప్పుడే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామని, వెంటనే పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేసినా పాలకుల్లో చలనం లేకపోయిందని అన్నారు. కాళేశ్వరం పంపుల బటన్ నొక్కితే ప్రాజెక్టుపై గతంలో తాము చేసిన తప్పుడు ప్రచారం ఎక్కడ బట్టబయలవుతుందోనన్న భయంతోనే ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు.

దేవుడు తెలంగాణ రైతుల కోసం సమృద్ధిగా నదుల్లో నీళ్లిస్తే.. మధ్యలో పూజారి రేవంత్‌రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కకుండా రైతుల గొంతు నొక్కారని మండిపడ్డారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిందని, ఆ నీటిని వినియోగించుకుంటే కోటి ఎకరాలకు సాగునీరు అందేదని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, ఆయనో రెన్యువల్ సీఎం అని  విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు ఈఎంఐ సమయానికి ముడితేనే ఆయన సీఎం కుర్చీ రెన్యువల్ అవుతుందని ఆరోపించారు.  అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను  అమలు చేస్తామని చెప్పి  ఇప్పుడు ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.  కేసీఆర్​ హయాంలోనే నిర్మల్  అభివృద్ధి జరిగిందని చెప్పారు.