ఫీజు బకాయిలు ఇవ్వాలి..సర్కారుకు ప్రైవేటు మేనేజ్మెంట్ల సంఘం వినతి

ఫీజు బకాయిలు ఇవ్వాలి..సర్కారుకు ప్రైవేటు మేనేజ్మెంట్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్‌‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకుంటే ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడటం ఖాయమని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య (ఫతీ) తెలిపింది. ఫీజులు రాక కాలేజీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, అవి కొనసాగాలంటే కనీసం 50 శాతం బకాయిలను విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక, ఉన్నత విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఫతీ చైర్మన్ ఎన్. రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, కోశాధికారి కె. కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. సునీల్ కుమార్ వినతిపత్రం అందించారు. కోర్సులు పూర్తి చేసుకుని వెళ్లిపోయిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్ సొమ్మును వారి వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా నేరుగా సంబంధిత కాలేజీల బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేయాలని కోరారు. 

చదువు పూర్తయిన తర్వాత విద్యార్థుల నుంచి ఆ మొత్తాన్ని రాబట్టుకోవడం యాజమాన్యాలకు అసాధ్యంగా మారిందన్నారు. ప్రభుత్వమిచ్చిన సొమ్ము ఖాతాల్లో పడ్డా చాలామంది విద్యార్థులు కాలేజీలకు చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల కాని మైనారిటీ విద్యార్థుల రీయింబర్స్​మెంట్, స్కాలర్‌‌షిప్ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలు భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి నెట్టుకొస్తున్నాయని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.