- 15 ఏండ్లల్లో ఘోరాలు
- నిందితుడు ముజురిజి మోసెస్‌గా గుర్తింపు.. పలు జిల్లాల్లో ఘాతుకాలు !
- విచారించి కచ్చితంగా ఉరి తీస్తామని డిఫెన్స్ చీఫ్ బహిరంగ ప్రకటన
కంపాలా: ఉగాండా దేశంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి గత 15 ఏండ్లలో ఏకంగా 38 మందిని దారుణంగా హత్య చేసి, వారి మాంసాన్ని తిన్నాడు. ఈ నరరూప రాక్షసుడిని ముజురిజి మోసెస్ గా గుర్తించిన పోలీసులు.. ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ ముహూజి కైనెరుగాబా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ముజురిజి మోసెస్ ఉగాండా దేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్, నరమాంస భక్షకుడని పేర్కొన్నారు. అతను 2010 నుంచి 2025 మధ్య కాలంలో మసాకా, ఇబాండా, కజో జిల్లాల్లో 8 మందిని దారుణంగా హత్య చేసి, డెడ్ బాడీలను తినేశాడని తెలిపారు. దీనిపై వేగంగా విచారణ జరిపి.. నిందితుడిని కచ్చితంగా ఉరితీస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఆధారాలు సేకరణ పూర్తి
అరెస్టు తర్వాత పోలీసులు నిందితుడి ఇంట్లో కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. గతంలో అదృశ్యమైన వ్యక్తులు, ఎటూ తేలని హత్య కేసుల వివరాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. ఇతనికి ఆ కేసులతో ఏమైనా సంబంధం ఉందా అని కూపీ లాగుతున్నారు.
ఈ అరెస్ట్‌తో దశాబ్దానికి పైగా కొనసాగుతున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ వీడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, చట్టం ప్రకారం ఈ ఆరోపణలన్నీ పూర్తిస్థాయి విచారణలో నిరూపించాల్సి ఉంది. కాగా.. సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు ఉగాండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కుటుంబాలకు కుటుంబాలనే పొట్టనపెట్టుకున్నడు
నిందితుడు గతంలో అనేక దారుణమైన హత్యలకు పాల్పడ్డాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతను నేరుగా ఇళ్లలోకి చొరబడి, కత్తులతో కుటుంబాల్లోని సభ్యులందరిని చంపేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. పెంటెకోస్టల్ పాస్టర్ స్టీవెన్ ముగాంబే ఇంటిపై దాడి చేసి, అక్కడ ఉన్న అందరినీ దారుణంగా నరికి చంపినట్లు వివరించారు.
అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో ప్రేమ పేరుతో నమ్మించి, మోసగించి యువతులను హతమార్చినట్లు వెల్లడించారు. మోసెస్ పలుమార్లు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని తెలిపారు. ఇప్పుడు భద్రతా బలగాలు అతన్ని పక్కా సమాచారంతో మరోసారి అదుపులోకి తీసుకున్నాయని పేర్కొన్నారు.
