- తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ
బెంగళూరు: కర్నాటకలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తర్వాత తుది ఓటర్ల జాబితాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. సర్ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 5,54,32,314 మంది ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో ఆ సంఖ్య 1.08 కోట్ల మేర తగ్గింది. కొత్త లిస్టు ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,54,55,689 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.25 కోట్లకు పైగా పురుషులు, 2.29 కోట్ల మంది మహిళలు, 2,841 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18, 19 ఏళ్ల వయసున్న 6.83 లక్షల మందికి పైగా యువ ఓటర్లు, 85 ఏళ్లు దాటిన 3.92 లక్షల మందికి పైగా సీనియర్ సిటిజన్లకు జాబితాలో చోటు దక్కింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో కొత్తగా 8.64 లక్షల మంది ఓటర్లు చేరారు.
ముసాయిదా జాబితాలో కోటికి పైగా పేర్లను తొలగించిన అధికారులు.. దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది జాబితాను ప్రకటించారు. నివాసం మార్చుకోవడం, గణన సమయంలో ఆచూకీ లభించకపోవడంతో 80.62 లక్షల పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. మరణించిన ఓటర్లకు సంబంధించిన 16.39 లక్షల ఎంట్రీలు, నకిలీవిగా గుర్తించిన 7 లక్షలకు పైగా పేర్లు, ఇతర కారణాలతో 3.83 లక్షల పేర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానచలనం లేదా ఆచూకీ లభించకపోవడంతో జాబితాలో పేరు కోల్పోయిన వారు తిరిగి నమోదు చేసుకునేందుకు ఫారం-6 దరఖాస్తు చేసుకోవాలి. కొత్త ఓటర్ల నమోదు సహా ఎన్నికల అధికారులకు మొత్తం 7,87,534 దరఖాస్తులు అందాయి. నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రధాన ఎన్నికల అధికారి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఓటర్లు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ సెర్చ్ పోర్టల్లో ‘ఎపిక్ ద్వారా సెర్చ్’ ఆప్షన్ ఎంచుకుని, ఓటర్ ఐడీ నంబర్, క్యాప్చా వివరాలు నమోదు చేసి తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ‘నో ఫౌండ్’ అని వస్తే వెంటనే ఆందోళన చెందకుండా అధికారిక ఓటర్ల జాబితాలో వివరాలు పరిశీలించాలని, అవసరమైతే ఎన్నికల అధికారులను సంప్రదించాలని సూచించారు.
