మెదక్/ కొల్చారం, వెలుగు: మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు గల్లంతయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద మంగళవారం జరిగింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (25), ఆమె కూతుళ్లు వైష్ణవి, శ్రావణిక మిస్సింగ్ అయినట్టు ఎల్లారెడ్డిలో కేసు నమోదు అయ్యింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద సిగ్నల్ చూపించడంతో మెదక్ రూరల్ సీఐ, కొల్చారం ఎస్సై, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా నది ఒడ్డున ముగ్గురి చెప్పులు, సెల్ ఫోన్ లభించాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సరిత ఆధార్ కార్డులో సవరణ చేయించుకునేందుకు మెదక్ లో ఉంటున్న తన అక్క దగ్గరికి వస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏడుపాయల సమీపంలోని మంజీరా నది వద్దకు చేరుకున్న ఆమె నదిలో దూకుతున్నట్లు ఎల్లారెడ్డిలో ఉన్న తన తండ్రి బాలకిష్టయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సరిత భర్త గుండె పోటుతో మృతి చెందగా ఆమె ఒంటరిగా హైదరాబాద్ లో నివసించేది. గల్లంతైన చిన్నారుల్లో వైష్ణవి ఐదో తరగతి, శ్రావణిక నాలుగో తరగతి చదువుతున్నారు. సుమారు రెండు గంటల పాటు గాలించినప్పటికీ తల్లి, ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను పోలీసులను ఆపేశారు. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడుతామని రూరల్ సీఐ కృష్ణమూర్తి తెలిపారు.
