అటవీ స్కీంలను పూర్తి చేయాలి : పీసీసీఎఫ్‌‌ వినయ్‌‌ కుమార్‌‌

అటవీ స్కీంలను పూర్తి చేయాలి : పీసీసీఎఫ్‌‌ వినయ్‌‌ కుమార్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: అటవీ శాఖలో అమలవుతున్న వివిధ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పీసీసీఎఫ్‌‌ వినయ్‌‌ కుమార్‌‌ ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌‌ నుంచి 5 సర్కిళ్ల సీసీఎఫ్‌‌లు, సీఎఫ్‌‌లు, డీఎఫ్‌‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నిధుల వినియోగానికి నెలవారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. 2027–28 వన మహోత్సవానికి అవసరమైన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. అటవీ నేరాల నియంత్రణకు చెక్‌‌పోస్టులు, సామిల్లుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

వన్యప్రాణుల రక్షణకు ర్యాపిడ్‌‌ రెస్క్యూ బృందాలను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. కోతుల సమస్య పరిష్కారానికి స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి సంయుక్త తనిఖీలు చేపట్టాలని, సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.  పీసీసీఎఫ్(డెవలప్‌‌మెంట్) రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్‌‌లు శర్వణన్, ప్రియాంక వర్గీస్, ఎస్జే ఆశా, క్షితిజ  తదితరులు పాల్గొన్నారు.