రాహుల్ వర్సెస్ నిర్మలా.. టాటా గ్రూప్ వివాదంపై మాటల యుద్ధం

రాహుల్ వర్సెస్ నిర్మలా.. టాటా గ్రూప్ వివాదంపై మాటల యుద్ధం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ అంతర్గత వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ టాటా గ్రూప్ వివాదంపై స్పందిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్‎ను టార్గెట్ చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా టాటా గ్రూప్‎ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆమె హితవు పలికారు. 

రాహుల్ ఏమన్నారంటే..? 

టాటా గ్రూప్ ఇంటర్నల్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘టాటా గ్రూప్‎ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేరపూరితంగా నాశనం చేస్తోంది. ఏ వ్యాపార నాయకుడు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడటానికి సాహసించడం లేదు. మీరు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు..? చివరకు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. భారతీయ వ్యాపారాలు బీజేపీకి ఆటవస్తువు కాదు. మేము అలా జరగనివ్వం. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాము’’ అని రాహుల్ పేర్కొన్నారు.

ప్రతిది రాజకీయం చేయొద్దు: నిర్మలా సీతారామన్

టాటా గ్రూప్‎ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నాశనం చేస్తోందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. టాటా సన్స్ పునర్‌నియామక వివాదాన్ని గాంధీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని చురకలంటించారు. 

►ALSO READ | ఓటు ఉన్నళ్లోకు మళ్లీ ఫామ్ 6 ఏంటీ.. అసలు బుర్ర వాడారా..? ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్

రాజ్యంగబద్ధమైన లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ఆపాలని హితవు పలికారు. వాణిజ్య, చట్టపరమైన అంశాలను అంత తేలికగా క్రిమినల్ అని ముద్ర వేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

భారతీయ పరిశ్రమలపై రాహుల్ గాంధీ విషాన్ని, అవిశ్వాసాన్ని నింపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దశాబ్దాల పాటు లైసెన్స్-కోటా రాజ్ ద్వారా భారతీయ పారిశ్రామికవేత్తల స్ఫూర్తిని దెబ్బతీసి, కోట్లాది మందిని కాంగ్రెస్ పార్టీ పేదరికంలోకి నెట్టిందని ఎదురు దాడి చేశారు. 

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక రంగాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలను తెచ్చిందని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం పౌరులందరికీ న్యాయాన్ని చేకూరుస్తుందని, కోర్టులు ఆ బాధ్యతను నెరవేరుస్తాయని హితవు పలికారు. కాంగ్రెస్ గతంలో న్యాయవ్యవస్థను సైతం అవమానించిందని విమర్శించారు.