వాళ్లకు తెల్లతోలు హీరోయిన్లే కావాలి: సెట్స్‌లో ఫ్రెండ్లీగా ఉంటూనే ఫేవర్స్ అడుగుతారు..రాధికా ఆప్టే కామెంట్స్!

వాళ్లకు తెల్లతోలు హీరోయిన్లే కావాలి: సెట్స్‌లో ఫ్రెండ్లీగా ఉంటూనే ఫేవర్స్ అడుగుతారు..రాధికా ఆప్టే కామెంట్స్!

సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం కంటే టాలెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల స్కిన్ కలర్ కూడా అవకాశాలపై ప్రభావం చూపుతోందనే చర్చ ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే విషయంపై రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మార్చాయి. 

సౌత్ సినిమాల్లో నార్త్ ఇండియన్ హీరోయిన్లకు అవకాశాలు రావడానికి వారి తెల్లతోలు కూడా ఒక కారణమై ఉండొచ్చని రాధికా అభిప్రాయపడ్డారు. అయితే, దక్షిణాదిలో అందం, అభినయం, టాలెంట్‌తో పాటు స్థానిక భాషలపై మంచి పట్టు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారని గుర్తుచేశారు. అలాంటప్పుడు వారిని పక్కనపెట్టి, ఇక్కడి భాష తెలియని ఇతర ప్రాంతాల నటీమణులను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పైగా, భాష రాని హీరోయిన్లకు ఇతరులతో డబ్బింగ్ చెప్పించడం కూడా తనకు నచ్చదని క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ సెలక్షన్లో స్కిన్ కలర్‌ కంటే టాలెంట్‌, పాత్రకు సరిపోవడం, భాషపై పట్టు వంటి అంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని రాధికా సూచించింది.

అందుకే సౌత్ సినిమాలకు దూరంగా..: రాధికా ఆప్టే 

రాధికా ఆప్టే తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో వచ్చిన రక్త చరిత్రతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత రక్త చరిత్ర 2, ధోని, లయన్, లెజెండ్, కబాలి వంటి సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చిత్తిరం పేసుతాడి 2,  2019లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె కొత్త సౌత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

అయితే, దక్షిణాది సినిమాలకు దూరంగా ఉండటానికి ఇండస్ట్రీలో తాను గమనించిన కొన్ని పద్ధతులపై ఉన్న అసంతృప్తి కూడా ఒక కారణమని రాధికా తెలిపారు. తనకు నచ్చని ధోరణులను ప్రోత్సహించడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపికలో స్కిన్ కలర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారనే తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు.

►ALSO READ | RajiniKamal: థియేటర్లలోకి రాకముందే రూ. 150 కోట్ల ఓటీటీ డీల్? రజినీకాంత్-కమల్ హాసన్ల 'ధర్మన్' రికార్డు!

మరోవైపు, భాష తెలియకపోవడం కూడా తనకు పెద్ద సవాలుగా మారిందని ఆమె చెప్పారు. డైలాగ్స్ చెప్పడం మాత్రమే కాకుండా.. సన్నివేశాన్ని అర్థం చేసుకుని సహజంగా నటించాలంటే ఆ భాషపై పట్టు ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకే, పాత్రకు తననే ఎంపిక చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉన్నప్పుడే సౌత్ సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సెట్స్‌లో ఫ్రెండ్లీగా ఉంటూనే ఫేవర్స్ అడుగుతారు..

సౌత్ సినిమా సెట్స్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి రాధికా ఆప్టే ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో చాలామంది తనతో చాలా ఆప్యాయంగా ఉండేవారని, ‘నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి’ అన్నట్లుగా చూసుకునేవారని గుర్తుచేసుకున్నారు. దీంతో అందరితో స్నేహంగా మాట్లాడే అవకాశం ఉండేదని చెప్పారు.

అయితే, ఈ చనువు కొన్నిసార్లు తనకు ఇబ్బందిగా మారేదని రాధికా తెలిపారు. కుటుంబ సభ్యురాలిలా చూస్తున్నామనే భావనతో, తమ కోసం కొన్ని పనులు చేయాలని ఆశించేవారని చెప్పారు. స్నేహపూర్వకంగా ఉండటంలో తప్పులేకపోయినా.. ఆ అనుబంధం పేరుతో ఫేవర్స్ చేయాల్సి రావడం తనకు నచ్చేది కాదని వివరించారు.

గతంలో కొన్ని తెలుగు సినిమా సెట్స్‌లో ఎదురైన అసౌకర్యకరమైన అనుభవాలను కూడా ఆమె గతంలో గుర్తుచేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళగా తాను ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ అనుభవాలు సినిమా సెట్స్‌లో మహిళలకు గౌరవం ఇవ్వడం, వారి వ్యక్తిగత హద్దులను గుర్తించడం, ప్రొఫెషనల్ వాతావరణాన్ని కల్పించడం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తున్నాయి.

మారాల్సింది ఇండస్ట్రీ ఆలోచనా విధానమేనా?

రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీశాయి. హీరోయిన్‌ను ఎంపిక చేసేటప్పుడు ఆమె టాలెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారా? లేక అందం, స్కిన్ కలర్‌ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి దక్షిణాదిలోనే అద్భుతంగా నటించగల, స్థానిక భాషలపై మంచి పట్టు ఉన్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నటీమణులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తే కొత్త టాలెంట్‌కు గుర్తింపు రావడంతో పాటు, కథలకు మరింత సహజత్వం కూడా వస్తుంది. ప్రేక్షకులు కూడా కేవలం రూపాన్ని మాత్రమే కాకుండా నటన, పాత్రలోని సహజత్వం, కథతో కనెక్ట్ అయ్యే అంశాలను ఆదరిస్తున్నారు. హీరోయిన్ అంటే ఫెయిర్ స్కిన్ ఉండాలనే ఆలోచనకు ఇకనైనా ఫుల్‌స్టాప్ పడాలా? టాలెంట్‌కు రంగుతో సంబంధం లేదనే విషయాన్ని ఇండస్ట్రీ గుర్తించాల్సిన సమయం వచ్చిందా? రాధికా ఆప్టే వ్యాఖ్యలు లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలకు సినీ పరిశ్రమ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

‘అక్క’తో ప్రేక్షకుల ముందుకు రానున్న రాధికా ఆప్టే!

ఒకవైపు సౌత్ సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తున్న రాధికా ఆప్టే.. మరోవైపు తన కొత్త వెబ్ సిరీస్ అక్కతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సిరీస్‌లో ఆమె కీర్తి సురేష్‌తో కలిసి నటించారు. రాధికా రుద్ర పాత్రలో కనిపించనుండగా, కీర్తి సురేష్ భవానిగా సందడి చేయనున్నారు. 1980ల కాలం నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. కల్పిత ప్రాంతమైన పెర్నూరు చుట్టూ సాగుతుంది. ఇద్దరు మహిళల మధ్య అధికారం కోసం జరిగే పోరు, వారి మధ్య నెలకొనే ఆధిపత్య పోటీ కథలో కీలకంగా ఉండనున్నాయి. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సిరీస్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రాధికా ఆప్టే, కీర్తి సురేష్ కలిసి తెరపై ఎలాంటి పోరాటాన్ని చూపించబోతున్నారు? అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.