సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు చెబితేనే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు గుర్తొస్తాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కించి ' జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 744 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రజనీ తన పాత రికార్డులను తానే తిరగరాశారు. 70 ప్లస్ వయసులోనూ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు.
'ధర్మన్' భారీ అంచనాలు..
అయితే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం 'ధర్మన్' విడుదలకు ముందే బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఓటీటీ హక్కుల రూపంలో ఏకంగా రూ.150 కోట్ల డీల్ కుదిరినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఈ సినిమా డిజిటల్ బిజినెస్ పరంగా భారీ మైలురాయిని అందుకున్నట్టే..
జియోహాట్‌స్టార్‌తో భారీ డీల్..
రజినీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ధర్మన్' డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామిగా జియోహాట్‌స్టార్‌ను, సంగీత హక్కుల భాగస్వామిగా సరిగమను మేకర్స్ ప్రకటించారు. అయితే రూ.150 కోట్ల ఓటీటీ డీల్‌పై అధికారిక ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నుంచి వస్తున్న మరో రెండు సినిమాలతో కలిపి మొత్తం హక్కుల ఒప్పందం రూ.350–400 కోట్లకు పైగా ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
డాక్టర్‌గా తలైవర్..
ఈ సినిమాలో రజినీకాంత్ ఓ స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో రక్తపు మరకలున్న సర్జికల్ పరికరంతో ఆయన కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సిమ్రన్, రాశీ ఖన్నా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ALSO READ : 50 వేల స్క్రీన్లపై 'రామాయణం' .. 100 దేశాల్లో భారతీయ ఇతిహాసం!
కమల్ మాస్టర్ ప్లాన్..
జియోహాట్‌స్టార్‌తో కుదిరినట్లు ప్రచారంలో ఉన్న భారీ ప్యాకేజీలో శివకార్తికేయన్ నటిస్తున్న 'సేయోన్', కమల్ హాసన్ తదుపరి ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో ధ్రువీకరణ పొందితే, నిర్మాణ సంస్థకు విడుదలకు ముందే ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది. మొత్తానికి రజినీకాంత్ స్టార్డమ్, కమల్ హాసన్ నిర్మాణం, అనిరుధ్ సంగీతం కలిసిన 'ధర్మన్' థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. అయితే రూ.150 కోట్ల డీల్ వార్తపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
