ఆఫీసుకు వచ్చి ఆటలు ఆడుకుంటే తీసేయక ఏం చేస్తారు : మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌పై నెటిజన్లు సెటైర్లు

ఆఫీసుకు వచ్చి ఆటలు ఆడుకుంటే తీసేయక ఏం చేస్తారు : మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్‌పై నెటిజన్లు సెటైర్లు

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులపై ఆఫీసుకు వచ్చి ఆటలు ఆడుకుంటే తీసేయక ఏం చేస్తారు.. మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ పై నెటిజన్ల రియాక్షన్ ఇది. టెక్ దిగ్గజం ఇటీవల ప్రకటించిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ పై చర్చలో భాగంగా గతంలో ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విలాసవంతమైన ఆఫీస్ లైఫ్ రీల్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆఫీస్‌లో లంచ్‌లు, స్నాక్స్, తిరుగుడు, ఆటపాటలతో గడిపిన క్షణాలను 'ఏ డే ఇన్ ది లైఫ్' అంటూ షేర్ చేసిన పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆగ్రహానికి కారణంగా మారుతున్నాయి.

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సంస్థ సుమారు 60 వేల మంది ఉద్యోగులకు ఇక మీరు మాకు అక్కర్లేదంటూ బైఔట్ ఆఫర్ అందించటంతో అప్పట్లో ఉద్యోగులు ఆఫీసులో ఎంజాయ్ చేసిన వీడియోలు తెరపైకి వచ్చాయి. ఆఫీసుల్లో లభించే విలాసాలు, సౌకర్యాల గురించి గర్వంగా రీల్స్ చేసుకునే ఉద్యోగుల తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అసలు పని చేయకుండా సోషల్ మీడియా రీల్స్ చేయడం వల్లే కంపెనీలు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

ఆఫీస్ అందించే వసతులను ఉద్యోగులు ఉపయోగించుకోవడంలో తప్పులేదని, ఇది మెంటల్ హెల్త్‌కి మంచిదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల సంక్షేమం కోసం అందించే విలాసవంతమైన సదుపాయాలు, ఉద్యోగ భద్రతకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫీసుల్లో అసలు పనులు మాని రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో హడావుడి చేయడం వల్ల ఉద్యోగులపై యాజమాన్యాలు కన్నెర్రజేసే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

►ALSO READ | మీ బైక్ పోయిందా.. అయితే ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలంటే వెంటనే ఈ పని చేయకండి!

పెద్ద టెక్ కంపెనీల్లో జాబ్ సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో.. కార్పొరేట్ కల్చర్, ఎంప్లాయిస్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. ఆఫీసుల్లో విలాసాలకే పరిమితమైన ప్రొడక్టివిటీని దెబ్బతీసే ఉద్యోగుల తీరు వల్లే లేఆఫ్స్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. మెుత్తానికి ఆఫీసులకు వెళ్లి పనిచేసుకోకుండా కబుర్లు చెప్పుకునే బ్యాచ్, రీల్స్ చేసుకునే బ్యాచ్, ఫ్రెండ్స్ తో టైమ్ పాస్ చేసే బ్యాచ్ వల్ల కంపెనీలు ఏఐ టెక్నాలజీల వైపు మళ్లి తమ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.