జియో లిస్టింగ్ వేదికపై కన్నీరు పెట్టుకున్న అంబానీ.. అనంత్ మాటలకు రిలయన్స్ బాస్ ఎమోషనల్!

జియో లిస్టింగ్ వేదికపై కన్నీరు పెట్టుకున్న అంబానీ.. అనంత్ మాటలకు రిలయన్స్ బాస్ ఎమోషనల్!

జియో ప్లాట్‌ఫారమ్స్ స్టాక్ మార్కెట్ అరంగేట్ర వేడుక ముంబైలోని ఎన్‌ఎస్‌ఈలో అట్టహాసంగా జరిగింది. అంబానీ ఫ్యామిలీ మెుత్తం జియో గ్రాండ్ లిస్టింగ్ వేడుకలో పాల్గొన్నారు. ఒకవైపు కోట్లాది మంది ఇన్వెస్టర్ల ఆశీస్సులతో జియో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇవ్వగా.. మరోవైపు ఆ వేదికపై జరిగిన ఒక భావోద్వేగ సన్నివేశం అందరినీ కంటతడి పెట్టించింది. దేశీయ కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన పిల్లల అద్భుతమైన ప్రసంగం వింటూ ఆనందబాష్పాలు రాల్చారు. 

ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ కుమారుడు, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడుతూ.. జియో కేవలం ఒక కార్పొరేట్ కంపెనీ కాదని, దేశ ప్రజలందరూ కలిసి నిర్మించిన అద్భుతమని పేర్కొన్నారు. "జియోను ఈ దేశం ఆశీర్వదించింది. అమ్మేమో 'జియో మేరే లాల్' అంది, నాన్నమ్మ 'జుగ్ జుగ్ జియో' అంది, స్నేహితులేమో 'జియో యార్' అన్నారు" అంటూ చేసిన కామెంట్స్ అందరిలోనూ దేశభక్తిని, అనుబంధాన్ని నింపాయి. "ఈ జియోను మీరే సృష్టించారు.. మీ కలలను నెరవేర్చడమే మా కల" అని అనంత్ ఉద్వేగంగా చెప్పారు.

ఆకాష్, అనంత్, ఇషా ముగ్గురం వేర్వేరు శరీరాలైనా.. ఒక్కటే ఆత్మ అని, ప్రతి భారతీయుడి స్వప్నాన్ని నిజం చేయడమే తమ ఏకైక లక్ష్యమని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వేదికపై కొడుకు మాటలను వింటూ తండ్రి ముఖేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కంట తడి పెట్టుకున్న ఆయన తన కళ్లద్దాలు తీసి కన్నీటిని తుడుచుకుంటున్న దృశ్యం అందరినీ కదిలించింది.

అనంతరం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తన తండ్రి దార్శనికతను కొనియడటంతో వాతావరణం మరింత ఎమోషనల్‌గా మారింది. ఇతరులు ఊహించని భవిష్యత్తును తన తండ్రి ముఖేష్ అంబానీ ముందే చూశారని, ఎవరు అసాధ్యం అన్నా సరే.. దానిని సుసాధ్యం చేసి చూపించారని ఆమె ప్రశంసించారు. గత 13 ఏళ్లుగా అహర్నిశలు శ్రమించిన తన సోదరుడు ఆకాష్ అంబానీని ఆమె ఈ సందర్భంగా అభినందించారు.

ALSO READ : 20 శాతం లాభంతో JIO షేర్లు లిస్టింగ్

ఒక సాధారణ టెలికాం ఆపరేటర్‌గా ప్రారంభమై.. నేడు రూ.12.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే 2వ అత్యంత విలువైన కంపెనీగా జియో అవతరించడం వెనుక కుటుంబం పడిన తపన, త్యాగం ఆ వేదికపై కనిపించాయి. కష్టకాలంలోనూ తండ్రి కన్న కలలను తన పిల్లలు విజయవంతంగా నిజం చేసిన క్షణమే ముఖేష్ అంబానీని ఆనందంతో భావోద్వేగానికి గురిచేసింది.