జియో ప్లాట్‌ఫారమ్స్ అరంగేట్రంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడుతుందని భావించిన వేళ.. అనూహ్య పరిణామాలు మార్కెట్‌ను కుదిపేశాయి. ఒకవైపు జియో బ్లాక్‌బస్టర్ ఎంట్రీతో సంచలనం సృష్టించినా.. మరోవైపు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు ఇన్వెస్టర్లను బెంబేలెత్తించాయి. దీనికి తోడు మార్కెట్లపై బేర్స్ పంజా ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది ఉదయం 10.50 గంటల సమయంలో. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 94 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 158 పాయింట్లు కోల్పోయాయి. మెుత్తంగా మార్కెట్లు దాదాపు 1% మేర నష్టపోయినప్పటికీ, బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రం రూ. 470 లక్ష కోట్ల వద్ద నిలవడం విశేషం.
బుధవారం రోజున ప్రధాన రంగాలన్నింటిలోనూ అమ్మనాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ షేర్లు 2% నుంచి 4% వరకు పడిపోయి సెన్సెక్స్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అలాగే ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర షేర్లు 1% నుంచి 2% నష్టపోయాయి. ఇక రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 3% పైగా కుప్పకూలగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు 1% చొప్పున నష్టపోయాయి. మార్కెట్ అస్థిరతను తెలిపే ఇండియా విక్స్ సూచీ 4% దూసుకెళ్లి 17 మార్కును దాటింది.
మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టిన కారణాలు..
1. భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్: యెమెన్‌కు చెందిన హూతి తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అతిపెద్ద క్రూడ్ రిఫైనరీపై క్షిపణి దాడి చేసినట్లు ప్రకటించడం కలకలం రేపింది. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లకు పెరిగింది. ఇది భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ.
2. AI జోరు - ఐటీ స్టాక్స్ పతనం: సౌత్ కొరియాకు చెందిన చిప్ తయారీ దిగ్గజం 'ఎస్‌కే హైన్రిక్స్' రికార్డు స్థాయి లాభాలను ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో AI ఆశలు మళ్లీ చిగురించాయి. భారత్‌లో యాంటీ-ఏఐ ట్రేడ్‌గా చూసే ఐటీ షేర్లు దీనివల్ల భారీగా నష్టపోయాయి.
3. మళ్లీ పెరిగిన బాండ్ ఈల్డ్స్: అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ మళ్లీ 5% పైకి చేరాయి. 30 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 5.3% దాటడంతో ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన డెట్ మార్కెట్ వైపు తరలిపోతున్నాయి.
4. ఫెడ్ వడ్డీ రేట్ల సమావేశం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేటి నుంచి ప్రారంభం కానుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం ఎలా ఉంటుందనే టెన్షన్ మార్కెట్లను వెంటాడుతోంది.
దలాల్ స్ట్రీట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
జియో వంటి బలమైన ఐపీఓలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నప్పటికీ.. క్రూడ్ ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్‌ను ఇబ్బంది పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025లో ఇప్పటివరకు దాదాపు 31 బిలియన్ డాలర్ల FPI అవుట్‌ఫ్లోస్ నమోదు కావడం ఆందోళనకరమని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ పేర్కొన్నారు. దేశీయ మార్కెట్ మళ్లీ పుంజుకోవాలంటే ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్‌పీఐలు కొనుగోళ్ల బాట పట్టడం అత్యంత ముఖ్యం.
