రైల్ నిలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా : ఢిల్లీకి రైళ్లు ఇవ్వకపోవటంపై ఆందోళన

రైల్ నిలయం  ఎదుట కాంగ్రెస్ ధర్నా : ఢిల్లీకి రైళ్లు ఇవ్వకపోవటంపై ఆందోళన

రైల్వే శాఖ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ గరం గరం అవుతుంది. 2026, నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ మహా ధర్నాకు.. తెలంగాణ రాష్ట్రం నుంచి కార్యకర్తలు, నేతలు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు కావాలని కోరింది కాంగ్రెస్ పార్టీ. దీనిపై స్పందించిన రైల్వేశాఖ.. ప్రత్యేక రైళ్లు ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రైల్వే జీఎం నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సికింద్రాబాద్ లోని రైల్ నిలయం ఎదుట ధర్నాకు దిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ నుంచి రైల్ నిలయానికి ర్యాలీగా వెళ్లిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు.. రైల్వే జీఎం ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఢిల్లీకి ప్రత్యేక రైలు ఇవ్వకపోవటం వెనక కుట్ర ఉందని.. జీఎం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రైల్వే జీఎంపై ఒత్తిడి తెచ్చి.. కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రత్యేక రైళ్లు ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. 

నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు కావాలని కోరుతూ.. రైల్వే అధికారులకు వినతి పత్రం ఇచ్చారు నేతలు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ నిస్పక్షపాతంగా ఉండాలని.. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు నేతలు.