నాసిక్ కుంభమేళాకు భారీ ఏర్పాట్లు.. ధ్వజారోహణంకి ముహూర్తం ఫిక్స్.. రాష్ట్రపతి రాకతో కట్టుదిట్టమైన భద్రత!

  నాసిక్ కుంభమేళాకు భారీ ఏర్పాట్లు.. ధ్వజారోహణంకి ముహూర్తం ఫిక్స్.. రాష్ట్రపతి రాకతో కట్టుదిట్టమైన భద్రత!

మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబకేశ్వర్‌లో వచ్చే ఏడాది జరగనున్న సింహస్థ కుంభమేళాకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 31న నాసిక్‌లో కుంభమేళా ధార్మిక పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానుండటంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు, కార్యక్రమం జరిగే ప్రదేశంతో పాటు గోదావరి నది పరిసరాల్లోనూ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 

అక్టోబర్ 31న ధార్మిక పతాకావిష్కరణ
నాసిక్‌లోని రామకుండ్ సమీపంలో అక్టోబర్ 31న మధ్యాహ్నం 12.02 గంటలకు సింహస్థ కుంభమేళా ధార్మిక పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ప్రసంగాలు ఉండవు. ఇందుకోసం ప్రత్యేకంగా 'ఎల్' ఆకారంలో వేదికను ఏర్పాటు చేశారు. అఖాడాలకు చెందిన సాధువులు, మహంతులతో పాటు ఉజ్జయినికి చెందిన రాధే బాబాకు కూడా వేదికపై స్థానం కల్పించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం గోదావరి నది తీరంలో మహా హారతి నిర్వహించనున్నారు. దీనికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

భద్రత కోసం పోలీసుల ప్రత్యేక చర్యలు
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే రెండుసార్లు రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగే ప్రాంతం, అక్కడికి వెళ్లే రహదారులు, గోదావరి నది పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు, స్థానిక ప్రజలు ఒకేచోట గుమిగూడకుండా ఉండేందుకు రహదారులపై పలుచోట్ల డివైడర్లు ఏర్పాటు చేశారు. గోదావరి నది ఎడమ ఒడ్డున సాధారణ ప్రజలకు, కుడి ఒడ్డున హారతిలో పాల్గొనే వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. 5 వేల ప్రజలు కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గోదా హారతిని అందరూ స్పష్టంగా చూసేలా నది ఒడ్డున పలుచోట్ల స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

శైవ, వైష్ణవ సంప్రదాయాల మధ్య ఐక్యతకు సందేశం
నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రాంతాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా 13 అఖాడాలకు చెందిన ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులను మహా హారతికి ఆహ్వానించారు. శైవ, వైష్ణవ సంప్రదాయాల మధ్య ఐక్యతను చాటడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా ఉంది. అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గోదావరి తీరంలో ఆక్రమణల తొలగింపు
కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా గోదావరి నది తీరంలో ఉన్న కొన్ని ఆక్రమణలను తొలగిస్తున్నారు. అలాగే  రామ్‌కాల్ పథ్ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి.  గోదా హారతి కోసం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో కూరగాయల మార్కెట్‌ను కూడా మరో ప్రాంతానికి తరలించారు. గాఢ మహారాజ్ వంతెన కింద ఉన్న గౌరీ పటాంగణ్ వద్ద ప్రజలు నిలబడి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు తప్పని ఇబ్బందులు
రామకుండ్ ప్రాంతానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పూజలు, పుణ్యస్నానాలు, ఇతర ఆచారాల కోసం గోదావరి నది తీరాన్ని సందర్శిస్తారు. అయితే, ప్రస్తుతం పతాకావిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకోవడంతో రామకుండ్‌కు వెళ్లే రహదారులను పలుచోట్ల మూసివేస్తున్నారు. దింతో వృద్ధులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది.

 అధికారుల సన్నాహాలు
పతాకావిష్కరణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులతో పాటు పురోహిత సంఘం, ఇతర శాఖల సిబ్బంది కూడా  ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.  మొత్తంగా, సింహస్థ కుంభమేళా పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నాసిక్‌లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.