ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. SCO సదస్సుకు పాక్‌కు భారత్ ఆహ్వానం

ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. SCO సదస్సుకు పాక్‌కు భారత్ ఆహ్వానం

ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన  ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా పాకిస్తాన్‌కు భారత్ అధికారిక ఆహ్వానం పంపింది. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా నవంబర్ 20 నుంచి జరగబోయే షాంఘై సహకార సంస్థ (SCO) తొలి  సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ సదస్సులో పాల్గొనాల్సిందిగా  పాకిస్తాన్ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీని ఈ సదస్సుకు హాజరుకావాలని భారత్​ ఆహ్వానించింది.  

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 20నుంచి 22 వరకు న్యూఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. SCO కూటమిలోని భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్‌లతో సహా మొత్తం 10 సభ్య దేశాల ప్రతినిధులనుఈ సదస్సుకు ఆహ్వానించారు.

2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు 2025 మే 7న పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేశాయి. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య, సైనిక సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.

ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయినప్పటికీ, అంతర్జాతీయ కూటమి అయిన SCO నిబంధనల ప్రకారం భారత్ ఆహ్వానాన్ని పంపింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సంస్కృతి, వారసత్వాల పరిరక్షణ, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.