రాళ్లు విసిరినా.. రాడ్లతో కొట్టినా పగలని గ్లాస్: ఫ్రాన్స్ అల్లర్లను అడ్వర్టైజ్‌మెంట్‌గా మార్చిన చైనా కంపెనీ!

రాళ్లు విసిరినా.. రాడ్లతో కొట్టినా పగలని గ్లాస్: ఫ్రాన్స్ అల్లర్లను అడ్వర్టైజ్‌మెంట్‌గా మార్చిన చైనా కంపెనీ!

మార్కెటింగ్ ఐడియా అంటే ఈ చైనా కంపెనీలా ఉండాలనేలా ఉంది వాడి వాడకం. ఫ్రాన్స్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న అల్లర్లు, దుకాణాలపై దాడుల వీడియోను చైనా కంపెనీ ఏకంగా తన వ్యాపారానికి ప్రచార అస్త్రంగా మార్చేసుకుంది. రాళ్లు విసిరినా, రాడ్లతో కొట్టినా, కిరాతకంగా తన్నినా ఏమాత్రం పగలని తమ అన్‌బ్రేకబుల్ గ్లాస్ క్వాలిటీని చాటేందుకు ఏకంగా ఫ్రాన్స్ ఆందోళనల వీడియోను వాడి నెట్టింట సరికొత్త సంచలనం సృష్టించింది.

ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, విద్యా విధానం తదితర సమస్యలపై అక్టోబర్ 1 నుంచి విద్యార్థులు మొదలుపెట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్టోబర్ 17 నాటికి ఈ ఉద్యమంలోకి ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, రైతులు కూడా చేరడంతో అది పెద్ద ఎత్తున అల్లర్లుగా మారింది. ఈ క్రమంలో ఆందోళనకారుల చేతిలో చాలా షాపులు ధ్వంసమయ్యాయి, లూటీలు జరిగాయి. ఈ గొడవల సమయంలో ఒక ప్రముఖ లూయీ విట్టన్ స్టోర్ కిటికీలను పగలకొట్టేందుకు కొందరు వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ వీడియోలో షాపుకు అమర్చిన గాజు కిటికీలు మాత్రం ఎంత కొట్టినా పగలలేదు. రంధ్రాలు పడినా, పగుళ్లు వచ్చినా గాజు ముక్కలు కిందపడకుండా భద్రంగా ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని గమనించిన ఆ చైనా గ్లాస్ సప్లయర్ కంపెనీ.. వెంటనే ఆ విజువల్స్‌ను తన ప్రచారానికి ఉపయోగించుకుంది. తమ గాజు ఎంతటి బలమైన దాడులనైనా తట్టుకోగలదని, అత్యంత పటిష్టమైనదని నిరూపించడానికి ఈ ఫుటేజీని అడ్వర్టైజ్‌మెంట్‌గా మార్చేసింది.

ALSO READ : ఏఐతో వర్ల్ పూల్ ఫ్రిజ్లు.. పది సెకన్లకు ఒకసారి తాజాదనాన్ని స్కాన్ చేసి అలర్ట్ చేస్తుంది

సాధారణంగా యాడ్స్ కోసం లక్షలు ఖర్చు చేసే కంపెనీలకు భిన్నంగా, జరుగుతున్న పరిణామాల నుంచే ఈ చైనా బ్రాండ్ అద్భుతమైన మార్కెటింగ్ అవకాశాన్ని సృష్టించుకుంది. కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోతోనే తమ ప్రొడక్ట్ నాణ్యతను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది. కల్లోల వాతావరణాన్ని కూడా తమ వ్యాపార వృద్ధికి ఎలా వాడుకోవచ్చో నిరూపించిన ఈ చైనా కంపెనీ తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆందోళనకర పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ఈ ట్రిక్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.