బండ్లగూడ చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్.. రెండు కిలోమీటర్ల మేర వాహనాల క్యూ  

బండ్లగూడ చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్.. రెండు కిలోమీటర్ల మేర వాహనాల క్యూ  

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. బుధవారం(అక్టోబర్​ 28) ఉదయం బండ్లగూడ చౌరస్తా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ట్రాఫిక్​ లో గంటల తరబడి ఉండాల్సి వస్తోందని, ఆఫీసులకు, స్కూళ్లకు ఆలస్యం అవుతోందని వాహనదారులు వాపోతున్నారు. 

బండ్లగూడ చౌరస్తా దగ్గర వాహనాలు ఇష్టారాజ్యంగా వెళుతుండటంతో ట్రాఫిక్​ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. దీనికి తోడు కొంతమంది వాహనదారులు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మరింత స్తంభించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ALSO READ : హైదరాబాద్‌‌‌‌ లో పాడ్ టాక్సీలు ..పీపీపీ పద్ధతిలో అమలు చేసేందుకు ఫీజిబిలిటీ స్టడీ పూర్తి

బండ్లగూడ చౌరస్తా ప్రాంతంలో పీక్ అవర్స్‌లో అధిక వాహనాల రాకపోకలు, దీనికి తోడు రోడ్డు పనులతో తరచూ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా బండ్లగూడ నుంచి చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదలడంతో  కమ్యూటర్స్​ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఈ సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. బండ్లగూడ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ పెంచడంతో పాటు, రాంగ్ రూట్‌లో వెళ్లే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.