తిరుమల శ్రీవారి సేవలో అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి, ఉపాసన కామినేని..

తిరుమల శ్రీవారి సేవలో అపోలో వ్యవస్థాపకులు ప్రతాప్ రెడ్డి, ఉపాసన కామినేని..

అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి, ఆయన మనవరాలు ఉపాసన కామినేని కొణిదెల వారి కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని ఈ రోజు ( 28 అక్టోబర్) బుధవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  వైద్య సేవలే లక్ష్యంగా ప్రారంభమైన అపోలో ప్రస్థానం.. నేడు లక్షలాది మందికి ఆరోగ్య భరోసా కల్పించే స్థాయికి చేరుకుందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, విద్యా రంగాల విస్తరణకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు... ముఖ్యంగా చిత్తూరు జిల్లా అరగొండలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై మా కుటుంబానికి అపారమైన విశ్వాసం ఉందన్నారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. స్వామివారి కృపాకటాక్షాలతోనే అపోలో హాస్పిటల్స్ ప్రారంభమై.. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్న సంకల్పానికి శ్రీవారి ఆశీస్సులే బలమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంతో పాటు విద్యా రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరులో అపోలో యూనివర్సిటీ, ఆసుపత్రులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం లభిస్తోందన్నారు. ముఖ్యంగా ఉపాసన కామినేని కొణిదెల నేతృత్వంలో అమలు చేస్తున్న టోటల్ హెల్త్ ప్రోగ్రామ్ గురించి ఆయన ప్రస్తావించారు.

ఇక ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ.. మా తాతగారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ప్రారంభించిన సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, విద్యావకాశాలు అందించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుకున్నామని వెల్లడించారు.