పక్షవాతం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ముఖం ఒకవైపు వంకరపోవడం. కానీ, ఇదోక్కటే లక్షణం కాదు. మాట తడబడటం, ఒక్కసారిగా చూపు తగ్గడం, తీవ్రమైన తలనొప్పి, నడవలేకపోవడం వంటి లక్షణాలు కూడా పక్షవాతానికి సంకేతాలు కావచ్చు. వీటిని చిన్న సమస్యలు అనుకోని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.
మన శరీరంలోని ప్రతిదానిని కంట్రోల్ చేయడంలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. మనం మాట్లాడటం, నడవటం, చూడటం, ఆలోచించడం వంటి అన్నిటిని మెదడు కంట్రోల్లోనే జరుగుతాయి. అయితే, మెదడుకు రక్త సరఫరా ఒక్కసారిగా ఆగిపోయినా లేదా మెదడులోని రక్తనాళం చిట్లి రక్తస్రావం జరిగినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మెదడులోని కణాలు వేగంగా దెబ్బతినడం మొదలవుతుంది. అందుకే లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే, చికిత్స అంత త్వరగా అందించవచ్చు. దీనివల్ల ప్రాణాలను కాపాడటంతో పాటు, శాశ్వత వైకల్యం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పక్షవాతం వచ్చే ముందు లేదా వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటో తెలుసుకుందామా....
1. ముఖం, చేయి, కాలు వంకరపోవడం..
పక్షవాతం వచ్చినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోవచ్చు. నవ్వడానికి ప్రయత్నించినప్పుడు నోరు ఒకవైపుకు లాగినట్లు కనిపించవచ్చు. అలాగే, ఒక్కసారిగా ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, తిమ్మిరి రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నవ్వమని చెప్పండి. రెండు చేతులను పైకి ఎత్తమని చెప్పండి. ఒక చేయి పైకి ఎత్తలేకపోవడం లేదా ముఖం ఒకవైపు వాలిపోవడం గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
2. మాట తడబడటం.. చెప్పేది అర్థం కాకపోవడం
సాధారణంగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి అకస్మాత్తుగా మాట తడబడటం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం లేదా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం వంటివి పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలు కావచ్చు. కొన్నిసార్లు వ్యక్తి మాట్లాడటానికి ప్రయత్నించినా మాటలు సరిగా బయటకు రావు. మరికొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నది అర్థం కాకుండా ఉండవచ్చు. ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అలసట వల్లనో, ఒత్తిడి వల్లనో వచ్చాయని అనుకుని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ సమస్య అకస్మాత్తుగా మొదలైతే వెంటనే వైద్య సహాయం పొందాలి.
3. అకస్మాత్తుగా చూపు తగ్గడం
కళ్లు బాగానే ఉన్నా ఒక్కసారిగా చూపు మసకబారటం, ఒక వస్తువు రెండుగా కనిపించడం లేదా ఒక కన్ను లేదా రెండు కళ్లతో చూడటంలో ఇబ్బంది కలగడం కూడా పక్షవాతానికి సంకేతం కావచ్చు. ఇలాంటి సమస్యలు అకస్మాత్తుగా ఎదురైతే వాటిని సాధారణ కంటి సమస్యగా భావించకూడదు. మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కూడా చూపుపై ప్రభావం పడవచ్చు. అందుకే చూపులో ఆకస్మిక మార్పులు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
4. తలనొప్పి.. తల తిరగడం..
ఎలాంటి ముందస్తు సూచన లేకుండా ఒక్కసారిగా భరించలేనంత తలనొప్పి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు ఇలాంటి తలనొప్పి కనిపించవచ్చు. అలాగే, అకస్మాత్తుగా తల తిరగడం, నడవలేకపోవడం, నిలబడినప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం లేదా నడుస్తూ కింద పడిపోవడం వంటి లక్షణాలు కూడా పక్షవాతానికి (స్ట్రోక్) సంకేతాలు కావచ్చు. రోజూ సులభంగా చేసే పనులను ఒక్కసారిగా చేయలేకపోవడం లేదా తెలిసిన విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి కూడా పక్షవాతం లక్షణాలు కావచ్చు.
పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి FAST సూత్రం గుర్తుంచుకోండి
F – Face (ముఖం): నవ్వమని అడిగినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోతుందా?
A – Arms (చేతులు): రెండు చేతులూ పైకి ఎత్తమంటే ఒక చేయి బలహీనంగా ఉందా?
S – Speech (మాట): మాట తడబడుతోందా ? మాట్లాడినప్పుడు మాటలు స్పష్టంగా రావడం లేదా?
T – Time (సమయం): ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.
ఈ లక్షణాలన్నీ కనిపించే వరకు వేచి ఉండకండి. ఒక్క లక్షణం అకస్మాత్తుగా కనిపించినా స్ట్రోక్ అనుమానంతో వెంటనే స్పందించాలి.
పక్షవాతం వచ్చిందని అనుమానం వస్తే ఏం చేయాలి?
*ముందుగా అత్యవసర సహాయం కోసం 112కు కాల్ చేయండి.
*లక్షణాలు మొదలైన సమయాన్ని గుర్తుంచుకోండి లేదా రాసుకోండి.
*లక్షణాలు తగ్గిపోతాయేమోనని వేచి ఉండకండి.
*వైద్యుల సూచన లేకుండా ఆస్పిరిన్ సహా ఎలాంటి మందులూ ఇవ్వకండి. స్ట్రోక్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల వచ్చిందా, రక్తస్రావం వల్ల వచ్చిందా అనేది ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది.
*బాధితుడికి ఆహారం, నీరు ఇవ్వకండి. మింగడంలో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది.
*అంబులెన్స్ సహాయంతో వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకునేలా చూడండి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ లక్షణాలు కొన్ని నిమిషాల్లో తగ్గిపోయినా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు ఇది తాత్కాలికంగా మెదడుకు రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే 'ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్' (TIA), అంటే మినీ స్ట్రోక్ అయి ఉండవచ్చు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి హెచ్చరిక కావచ్చు. అందుకే లక్షణాలు తగ్గిపోయినా వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి.
