గర్భంలో అరుదైన వ్యాధితో శిశువు.. పెంచే ఉద్దేశం లేదన్న తల్లిదండ్రులకు హైకోర్టు ఊరట

గర్భంలో అరుదైన వ్యాధితో శిశువు.. పెంచే ఉద్దేశం లేదన్న తల్లిదండ్రులకు హైకోర్టు ఊరట

పుట్టుకతో అరుదైన జన్యు లోపం ఉన్న శిశువును జన్మించిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి అప్పగించేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది. 2026 అక్టోబర్ 28న ఈ కేసు విచారణ జరిపిన కోర్టు.. అస్తిపంజర వైకల్యం ( Skeletal Dysplasia) ఉన్న శిశువును పుట్టిన తర్వాత సంక్షేమ కమిటీకి అప్పగించేందుకు అంగీకరించింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరుదైన వ్యాధితో గర్భంలో పెరుగుతున్న (శిశువ) 33 వారాల గర్భాన్ని వైద్యపరంగా నిలిపివేయాలని (గర్భస్రావం) కోరుతూ ఆ దంపతులు గతంలో కేరళ హైకోర్టును  ఆశ్రయించారు. అయితే కోర్టు ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల కమిటీ  గర్భస్రావానికి నిరాకరించింది.

 పిండంలో ఉన్న ఈ లోపం ప్రాణాంతకమైనది కాదని , కాబట్టి గర్భాన్ని ఈ దశలో రద్దు చేయాల్సిన అవసరం లేదని మెడికల్ బోర్డ్ స్పష్టం చేసింది. వైద్యనిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకున్న  జస్టిస్ హరిశంకర్ వి. మీనన్ స్పందిస్తూ, ఆ దంపతులు పుట్టిన తర్వాత బిడ్డను పెంచే ఉద్దేశంలో లేనందున గర్భాన్ని రద్దు చేయాల్సిన పనిలేదని చెప్పారు. శిశువు పుట్టిన వెంటనే సురక్షితంగా శుశు సంక్షేమ బోర్డుకు అప్పగించవచ్చని తీర్పునిచ్చారు.

కేసు బ్యాగ్రౌండ్:

పిండానికి స్కానింగ్‌లో తీవ్రమైన శారీరక లోపమైన అస్తిపంజర వైకల్యం తో జన్మించనున్నట్లు గుర్తించిన నవ దంపతులు.. పిండాన్ని తొలగించేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు.  అప్పటికే ఆమె 33 వారాల గర్భవతి కావడంతో, వైద్యపరంగా గర్భాన్ని తొలగించుకునేందుకు  అనుమతి ఇవ్వాలంటూ వారు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.

భారత చట్టాల ప్రకారం (MTP Act) 24 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం చేయాలంటే మెడికల్ బోర్డు అనుమతి తప్పనిసరి. కోర్టు ఆదేశాల మేరకు త్రిసూర్ ప్రభుత్వ వైద్య కళాశాల నిపుణులతో కూడిన బోర్డు పిండాన్ని పరీక్షించింది.

 బిడ్డకు వైకల్యం ఉన్న మాట నిజమే అయినప్పటికీ, అది ప్రాణాంతకమైన లోపం  డకాదు అని బోర్డు స్పష్టం చేసింది. అంటే, ఆ బిడ్డ జన్మించిన తర్వాత బ్రతికే అవకాశం ఉంది.  ఈ కారణంతో 33 వారాల సుదీర్ఘ గర్భాన్ని ఈ దశలో తొలగించడం సురక్షితం కాదని నివేదిక ఇచ్చింది.

అయితే ఆ దంపతులు మానసికంగా, ఆర్థికంగా ఆ బిడ్డను పెంచే స్థితిలో లేరని, ఒకవేళ గర్భస్రావానికి అనుమతి ఇవ్వకపోతే ప్రసవం తర్వాత బిడ్డ బాధ్యతలను తీసుకోలేమని కోర్టుకు తెలిపారు. మెడికల్ బోర్డు నివేదిక ప్రకారం గర్భస్రావం చేయడం కుదరదు కాబట్టి, గర్భాన్ని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. అయితే, తల్లిదండ్రుల అభ్యర్థనను మన్నించి, బిడ్డ జన్మించిన వెంటనే ఆ శిశువును సంరక్షించే బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) కి అప్పగించాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం జరగాలని, శిశువుకు అవసరమైన అన్ని వైద్య సేవలను అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.