రాజేశ్ ఖన్నాతో సంబంధంపై అనిత అద్వానీకి షాక్.. 'లగ్జరీ లిటిగేషన్' అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

రాజేశ్ ఖన్నాతో సంబంధంపై అనిత అద్వానీకి షాక్.. 'లగ్జరీ లిటిగేషన్' అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

దివంగత బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రాజేశ్ ఖన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో తనకున్న సంబంధాన్ని వివాహంగా గుర్తించాలని కోరుతూ మాజీ నటి అనిత అద్వానీ చేసిన న్యాయపోరాటానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు తగిన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసును 'లగ్జరీ లిటిగేషన్'గా అభివర్ణించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం మరోసారి చర్చనీయాంశమైంది.

కావాల్సింది గౌరవం మాత్రమే..

జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తన సివిల్ కేసులో కోరుతున్నది కేవలం గౌరవమేనని అనిత తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు తగిన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను కొట్టివేసింది.

అసలు వివాదం ఏంటి?

తాను రాజేశ్ ఖన్నాతో చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేశారని అనిత అద్వానీ వాదన. 2012లో ఆయన మరణానికి ముందు ముంబైలోని 'ఆశీర్వాద్' బంగ్లా నుంచి డింపుల్ కపాడియా, ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ తనను బయటకు పంపించారని ఆరోపించారు. అయితే రాజేశ్ ఖన్నా మరణించిన తర్వాత 2013లో గృహహింస నిరోధక చట్టం కింద కేసు దాఖలు చేసిన అనిత.. నెలవారీ భరణంతో పాటు ముంబైలోని బాంద్రాలో మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను కోరారు. 

ఫలించని పోరాటం..

కపాడియా కుటుంబం వేసిన పిటిషన్ ను స్వీకరించిన బాంబే హైకోర్టు  2015లో   అనిత అద్వానీ గృహహింస ఫిర్యాదును కొట్టివేసింది. అనంతరం 2017లో దిండోషి సెషన్స్ కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. లేటెస్ట్ గా సుప్రీంకోర్టు సైతం ఆమె అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో రాజేశ్ ఖన్నాతో తన సంబంధానికి వివాహ హోదా కల్పించాలని అనిత చేసిన న్యాయపోరాటానికి మరో కీలక అడ్డంకి ఎదురైంది. ఈ కోర్టు కేసుతో పరిణామంతో మరోసారి రాజేశ్ ఖన్నా  వ్యక్తిగత జీవితం వార్తల్లోకి వచ్చింది.