టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు దర్శకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 'కల్ట్' ( #Cult ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈసారి రక్తపాతం, క్రూరత్వం, ఊహించని హింసతో కూడిన సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నాడు. భారతీయ సినిమాలోనే తొలి స్లాషర్ చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. అక్టోబర్ 30, 2026న థియేటర్లలో సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే విడుదలై సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన తొలి ట్రైలర్ సినిమాలోని పార్టీ నేపథ్యాన్ని, స్లాషర్ జానర్‌ను పరిచయం చేయగా..లేటెస్ట్ ట్రైలర్ మాత్రం విశ్వక్ సేన్ పోషించిన డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రపై ప్రధానంగా దృష్టి పెట్టింది. గోవాలో స్థానికుల పేరుతో ఇతర ప్రాంతాల వారిని, ముఖ్యంగా తెలుగు ప్రజలను వేధించే వారిని సహించనని చెప్పే పోలీస్ అధికారిగా విశ్వక్ కనిపిస్తున్నాడు. బాధితులకు అండగా నిలిచేందుకు గోవాకు వెళ్లే అతడి ప్రయాణం.. చివరకు ఎంతటి భయంకరమైన హింసకు దారితీస్తుందనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు.
కత్తిపోట్లు, కోతలు, రక్తపాతం, వరుస హత్యలతో ట్రైలర్ ఆద్యంతం వైల్డ్‌గా సాగింది. ముఖ్యంగా పార్టీ సన్నివేశాల్లో విశ్వక్ సేన్ చేసే విధ్వంసం సినిమాపై అంచనాలను పెంచుతోంది. అయితే, ఈ హింసాత్మక సన్నివేశాలను స్టైలిష్‌గా, కొంత కార్టూన్ తరహా విజువల్స్‌తో తెరకెక్కించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో సినిమా ఎంతటి క్రూరమైన కంటెంట్‌తో వస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఏ సర్టిఫికెట్‌తో విడుదలవుతున్న ఈ చిత్రంలో హింస ఏ స్థాయిలో ఉంటుందో తెరపైనే చూడాలి.
ఈ చిత్రంలో మురళీ శర్మ రాజకీయ నాయకుడిగా, శ్రీకాంత్ అయ్యంగార్ సీనియర్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు పోషిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశారు. దర్శకుడిగా విశ్వక్ సేన్ ఎంచుకున్న ఈ రక్తపాత ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
