ప్రకృతిలో ఎన్నో రకాల వైరస్లు జంతువుల నుంచి మనుషులకు మారుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా పశువుల్లో మాత్రమే కనిపించే ‘షమోండా’ వైరస్ కారణంగా తొలిసారిగా ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ ఘటన వైద్య నిపుణులను కలవరపెడుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఇది భారీగా వ్యాపించే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 61 బ్లడ్ క్యాన్సర్ రోగికి ఈ వైరస్ సోకింది. ఆయనకు ఇంతకుముందే స్టెమ్ సెల్ మార్పిడి జరిగింది. ఆ తర్వాత అతనికి తీవ్రమైన మెదడు వాపు సోకింది. చూపు మందగించడం, అయోమయం వంటి లక్షణాలతో బాధపడిన ఆయన కోమాలోకి వెళ్లారు. అక్టోబర్ 9, 2026 న లైఫ్ సపోర్ట్ తొలగించడంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. షమోండా వైరస్ సోకి మరణించిన ప్రపంచంలోని తొలి వ్యక్తిగా ఈయన రికార్డులకెక్కారు.
అసలు ఈ వైరస్ ఎలా సోకింది?
తూర్పు ఫ్రాన్స్‌లో సంచరిస్తున్న ఈ రోగికి ‘క్యూలికోయిడ్స్ మిడ్జెస్’ అనే అతి చిన్న కీటకాలు కుట్టడం వల్లే ఈ వైరస్ సోకి ఉంటుందని ఫ్రెంచ్ ఆరోగ్య, వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ప్రకటనలో తెలిపాయి. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ సెంటర్ ఫ్రూ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సంస్థలకు అధికారులు నివేదించారు. మృతుడి మెదడు ద్రవం, మూత్రం, లాలాజలంలో షమోండా వైరస్ జన్యు నమూనాలను వైద్యులు గుర్తించారు.
షమోండా వైరస్ నేపథ్యం ఏమిటి?
ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దీనిని మొదట 1965లో నైజీరియాలో పశువుల్లో గుర్తించారు. చిన్న కీటకాల కాటు ద్వారా ఇవి గొర్రెలు, మేకలు, గుర్రాలు, అల్పాకా జీవులకు సోకుతాయి. దీనివల్ల పశువుల్లో జ్వరం, విరేచనాలు, పాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు ఆఫ్రికా దేశాలు, జపాన్‌లో కనిపించిన ఈ వైరస్.. ఈ వేసవిలో తొలిసారిగా యూరప్‌లోని 14 దేశాలకు పాకింది. ప్రస్తుతం ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.
నిపుణులు ఏమంటున్నారు?
ఈ వైరస్ మనుషులలో వేగంగా వ్యాప్తి చెందుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు లియాన్ హాస్పిటల్ క్లినికల్ వైరాలజిస్ట్ గ్రెగోరీ డెస్ట్రాస్. చలికాలంలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోవడం వల్ల ఈ కీటకాల సంచారం ఆగిపోతుందని, తద్వారా వైరస్ వ్యాప్తి నిలిచిపోతుందని చెప్పారు జర్మనీకి చెందిన వెటర్నరీ వైరాలజిస్ట్ మార్టిన్ బీర్. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి పశువులు, కీటకాలు, మానవ నమూనాలపై నిరంతరం జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయడం అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
