స్పెయిన్లో ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు 68 మంది మృతి 

స్పెయిన్లో ఢీకొన్న హైస్పీడ్ రైళ్లు  68 మంది మృతి 
  • సిగ్నల్ వైఫల్యంతో ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు
  • మానవ తప్పిదమే కారణమన్న అధికారులు

 

బార్సిలోనా: స్పెయిన్ దేశంలోని మధ్య ప్రాంతమైన టొలెడో ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఉదయం రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నల్ వ్యవస్థ లోపం కారణంగా ‘ఇరియో’ రైలు పట్టాలపై నిలిచిపోగా, అదే ట్రాక్ పై ‘రెన్ఫే’ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో58 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ నేపథ్యంలో మాడ్రిడ్ - అండలూసియా హై స్పీడ్ మార్గంలో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ప్రమాద సమయంలో రెన్ఫే రైలులో 397 మంది, ఇరియో రైలులో సుమారు 147 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

ఈ ఘోర ప్రమాదానికి సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం, దానిని మాన్యువల్‌‌‌‌‌‌‌‌గా ఆపరేట్ చేసే సమయంలో జరిగిన మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. టొలెడో ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లోని లాస్ యెబెనెస్ పట్టణాల సమీపంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ కావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే వ్యవస్థను మాన్యువల్ మోడ్‌‌‌‌‌‌‌‌లోకి మార్చి నడిపించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌లోని కంట్రోల్ సెంటర్ నుంచి జారీ అయిన తప్పుడు ఆదేశాల వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ట్రాక్‌‌‌‌‌‌‌‌పై ‘ఇరియో’ రైలు నిలిచి ఉండగా.. అదే ట్రాక్‌‌‌‌‌‌‌‌పై దాని వెనుక వస్తున్న ‘రెన్ఫే’ రైలుకు ఆపరేటర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వేగంగా దూసుకొచ్చిన రెన్ఫే రైలు ఇరియో రైలును బలంగా ఢీకొట్టింది.

నుజ్జునుజ్జుగా మారిన బోగీలు

ప్రమాద తీవ్రతకు ఇరియో రైలు బోగీలు పట్టాలు తప్పి కాలువలోకి, ట్రాక్ పక్కనే ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లాయి. కొన్ని బోగీలు నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సింబ్బంది, హెలికాప్టర్లు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.

ప్రధాని దిగ్భ్రాంతి..

ఈ దుర్ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.