ఓయూ, వెలుగు: ఆరోగ్యవంతమైన యువతతోనే అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణతోపాటు భారత్‌ను 2029 నాటికి డ్రగ్స్‌రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఇందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన మాదకద్రవ్య రహిత భారతదేశం-, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య కార్యక్రమంలో 1,200 మందికి పైగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో ఆయన తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన 2029 నాటికి మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించాలనే పిలుపును ఆచరించాలని సూచించారు. డ్రగ్స్వ్యతిరేక ఉద్యమంలో భారతీయ రెడ్ క్రాస్ సంఘం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, దాని జాతీయ సేవా పథకం విభాగాలు చేస్తున్న కృషిని అభినందించారు.
వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ డ్రగ్స్ వ్యక్తి ఆరోగ్యంపైనే కాకుండా వ్యక్తిగత భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతుందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భారతీయ రెడ్‌క్రాస్ సంఘం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎం.దానకిశోర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో యువత చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు గవర్నర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఠాగూర్ ఆడిటోరియం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు సాగిన ఈ ర్యాలీకి విద్యార్థులు, ఎన్ఎస్ఎస్వలంటీర్లు హాజరయ్యారు. గవర్నర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శి కె.శశికిరణాచారి, భారతీయ రెడ్ క్రాస్ సంఘం తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రొ.శ్రీరాములు, ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ.నరేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
