న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలు, వారితో పాటు జీవిస్తున్న పిల్లల మానవ హక్కుల పరిరక్షణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కేంద్రంలోని తొమ్మిది మంత్రిత్వ శాఖల సీఎస్‌లు, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు గురువారం గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా.. మహిళా ఖైదీలు, వారి పిల్లల సంక్షేమం కోసం మొత్తం పది విస్తృత కార్యాచరణ రంగాలపై దృష్టి సారించినట్టు కమిషన్ పేర్కొంది.
ఇందులో భాగంగా అరెస్టుకు ముందు పాటించాల్సిన విధానాలు, జైలు అడ్మిషన్ రికార్డుల నిర్వహణ, పిల్లలకు సంబంధించిన సమగ్ర డేటాబేస్, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను పక్కాగా అమలు చేయాలని సూచించింది. వీటితో పాటు ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్య సేవలు, జైళ్లలో పరిశుభ్రమైన నివాస పరిస్థితులు, వారి హక్కులపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.
అలాగే తల్లులతో కలిసి జైల్లో ఉంటున్న లేదా బయట వేరుగా పెరుగుతున్న పిల్లల సంక్షేమం, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ములాఖత్ సౌకర్యాలు, ఉచిత న్యాయ సహాయం అందేలా చూడాలని తెలిపింది. కోర్టు వాయిదాల సమయంలో మహిళా ఖైదీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, జైలు నుంచి విడుదలయ్యాక వారు గౌరవంగా జీవించేందుకు పునరావాసం, సామాజిక పునరేకీకరణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. పారిన్ నేషనల్ ఖైదీల విషయంలో కూడా నిర్దిష్ట నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.
