తెలంగాణపై ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణపై ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. ఈ   జిల్లాల్లో భారీ వర్షాలు

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపైనా కొనసాగుతోంది. నిన్న (అక్టోబర్ 28) ఉదయం తీరం దాటిన అనంతరం ప్రభావం ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 

రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మధ్యాహ్నం వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

హైదరాబాద్‌లో నగరంలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సిటీలో ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. 

కురిసిన వర్షం:

అర్నాబ్ తుఫాను కారణంగా ఇవాళ (అక్టోబర్ 29) ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా కేంద్రంలో మోస్తరు వర్షం కురిసింది. తీవ్ర ఎండలతో కరువు పరిస్థితులను చూస్తున్న రైతులు వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లూనూ వర్షం కురిసింది. కోరుట్లలో ఉదయం నుంచి ముసురు కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో తేలికపాటి వర్షం కురుస్తుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో వర్షాలు కురుస్తున్నాయి. చల్లని ఈదురు గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం దొరికినట్లు స్థానికులు చెబుతున్నారు. 

బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం.. 

బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అల్ప పీడనం బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నవంబర్ 2 నుంచి 6 మధ్య ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. తద్వారా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.