- ఫామ్ 6, 7, 8లను మార్చే అధికారంలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత ఓటర్లకు (ముసాయిదా జాబితాలో పేరు మిస్ అయిన వారిని యాడ్ చేసేందుకు) ఫామ్-6 ఎందుకని ఈసీని ప్రశ్నించింది.
కరెక్షన్లకు ఫామ్-8 ఉందని, ఫామ్-6 కొత్త ఓటరుగా డిక్లేర్ చేసేందుకు మాత్రమేనని పేర్కొంది. చట్టబద్ధంగా నిర్ణయించిన ఫామ్ 6, 7, 8ల రూపాన్ని మార్చే అధికారం కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి లేదని అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఢిల్లీలో సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేనందున, పేర్ల పునరుద్ధరణ లేదా నమోదుకు గడువు విధించాల్సిన అవసరంలేదని పేర్కొంది.
ఏదైనా కారణంతో ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించలేకపోయిన లేదా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన పాత ఓటర్లను ‘కొత్త ఓటర్లు’గా పరిగణించొద్దు. వారి పరిస్థితికి తగినట్లుగా సులువైన ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అన్వేషించాలని సూచించింది. ఈసీ కేవలం ఓటర్ల నుంచి అప్లికేషన్లు వచ్చే వరకు చూడకుండా, నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలని సీజేఐ వ్యాఖ్యానించారు.
పిటిషనర్ల తరఫు వాదనలు
సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అమృత జోహ్రి దాఖలు చేసిన పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్లేస్‌కి ఇల్లు మారినవారు ఫామ్-8 (చిరునామా మార్పు) ఉపయోగించాల్సి ఉండగా, వారిని ఫామ్-6 ద్వారా ‘తాము గతంలో ఏ ఓటరు జాబితాలోనూ లేము’ అని డిక్లరేషన్ ఇవ్వమనడం సమంజసం కాదని వాదించారు. సుప్రీంకోర్టు సూచనలపై స్పందించిన ఎన్నికల సంఘం, దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించేందుకు అంగీకారం తెలిపింది.
