ఎల్ నినో కరువు  సాయం కోసం ఢిల్లీ వెళ్దాం..కరోనా సమయం నాటి స్ఫూర్తిని చాటుదాం: భట్టి విక్రమార్క

ఎల్ నినో కరువు  సాయం కోసం ఢిల్లీ వెళ్దాం..కరోనా సమయం నాటి స్ఫూర్తిని చాటుదాం: భట్టి విక్రమార్క

 

  • అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాం
  • రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపాం
  • ప్రజా ప్రయోజనాల కోసం నిర్మాణాత్మక సలహాలివ్వాలి
  • కరోనా సమయం నాటి స్ఫూర్తిని చాటుదామన్న భట్టి

 

హైదరాబాద్, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కేంద్ర ప్రభుత్వానికి కరువు నివేదికలు పంపామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బుధవారం సచివాలయంలో  జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన సహాయం కోసం అవసరమైతే అన్ని పార్టీల ప్రతినిధులతో కూడిన అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.  ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే అన్ని పార్టీలను ఆహ్వానించామని, విపత్తుల వేళ రాజకీయ విమర్శలు పక్కనపెట్టి ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు.

గతంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా ఎలా పోరాడాయో, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ప్రజా శ్రేయస్సు కోసం విభేదాలు వీడి సహకరించాలన్నారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షపాతం లోటు  ఉండటం వల్ల నదీ ప్రవాహాలు తగ్గాయని భట్టి వివరించారు.  సాధారణంగా పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు పడితే ఎగువ నుంచి ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చేదని, ప్రస్తుతం అన్నిచోట్లా వర్షాభావం ఉండటంతో జలవనరుల యాజమాన్యం అత్యంత కీలకంగా మారిందన్నారు.రిజర్వాయర్లలో ఉన్న నీటిని పొదుపుగా వాడుతూ పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా, పశువులకు తాగునీరు, మేత కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.  

రాబోయే వేసవి కాలంలో ఎదురయ్యే సవాళ్లను ముందే ఊహించి ప్రభుత్వం సన్నద్ధతతో ఉందని తెలిపారు. సమావేశంలో ప్రతిపక్ష నేతలు ప్రస్తావించిన అంశాలు, సూచనలను  సాధ్యమైనంత మేరకు  ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికలో భాగం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూడటమే ప్రజా ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని నీటిపారుదల శాఖ మంత్రి  ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కరువు పరిస్థితులను నిర్మాణాత్మక, సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఎదుర్కొంటుందని చెప్పారు.

అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీలో తెలంగాణ వాటాను దక్కించుకునేందుకు పటిష్టంగా వ్యవహరిస్తామన్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, విత్తనాలు, ఎరువుల లభ్యతపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.  సమావేశంలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, కోదండరెడ్డి, బీఆర్ఎస్ నుంచి బి.వినోద్ కుమార్, ఎల్.రమణ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీజేపీ నుంచి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం నుంచి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. సీపీఐ నుంచి పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నుంచి జాన్ వెస్లీ, నంద్యాల నరసింహారెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎస్పీ నేతలు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నేత శోభా యాదవ్, బీఎస్పీ నేత శ్రీరామ్ కృష్ణ, ఆప్ అధ్యక్షురాలు  హేమ సుదర్శన్, టీడీపీ నేత కాట్రగడ్డ ప్రసన్న ,  సీఎస్​ సంజయ్ జాజు, నోడల్ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు.  బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం, టీజేఎస్​, ఎంఐఎం, ఇతర పార్టీల లీడర్లు  పాల్గొన్నారు. 

ముందస్తు ప్రణాళికలు లేకుండా కాలయాపన: బీజేపీ

ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల ముందే రాష్ట్రాన్ని హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అసలైన కరువు నివారణ ప్రణాళికలు చూపలేదని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మూడు రోజులకొకసారి కూడా తాగునీరు రాని దుస్థితి నెలకొందని, నిత్యావసరాలు, బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడేళ్లుగా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా సచివాలయంలో కూర్చొని కరువు మండలాలను ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. కరువుతో అల్లాడుతున్న ప్రతి రైతు కుటుంబానికి వెంటనే రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

యాసంగికి క్రాప్ హాలీడే ఎందుకు ఇచ్చారు: బీఆర్ఎస్

అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డి, ఎల్.రమణ మాట్లాడారు. తొలి అఖిలపక్ష భేటీకి సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరు కావడం బాధాకరమని విమర్శించారు. రాష్ట్రంలో 24.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. 25 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ క్రాప్ హాలిడే ప్రకటించలేదని, ఇప్పుడు యాసంగికి ఎందుకు క్రాప్ హాలిడే ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 200 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తరలిపోతుంటే ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని ఆరోపించారు.