- నిబంధనలు ఉల్లంఘించిన
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ తో మందులు సప్లై చేసే ఫార్మసీలు, వాటి అనుబంధ మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ అధికారులు దాడులు చేశారు. టీజీ సేఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి క్యూర్ రీజియన్ పరిధిలో టాటా1ఎంజీ, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ మార్ట్, ఇన్‌స్టామార్ట్ వంటి ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ సంస్థలు, వాటితో భాగస్వామ్యం ఉన్న మెడికల్ షాపులు కలిపి మొత్తం 106 చోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిన 32 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ లేకుండానే అమ్మకాలు
రూల్స్ కు విరుద్ధంగా ప్రిస్క్రిప్షన్ మందులు అమ్మడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అమ్మకపు బిల్లులు ఇవ్వకపోవడం, ఔషధాల కొనుగోలు ఇన్వాయిస్‌లను అధికారులకు చూపించకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ రిజిస్టర్లతో పాటు షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కొనుగోళ్లు, అమ్మకాల రికార్డులను సక్రమంగా మెయింటన్ చేయకపోవడం వంటి లోపాలను గుర్తించి, చర్యలకు ఉపక్రమించారు.
నిబంధనలు పాటించాల్సిందే
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉన్న షాపులతో సహా ప్రతి మెడికల్ షాపు చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని టీజీ సేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ టోల్ ఫ్రీ నంబర్ 1800–-599–-6969కు సమాచారం అందించవచ్చని సూచించారు.
