సినీ నేపథ్యమున్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, కెరీర్‌లో ఎదురయ్యే ఛాలెంజెస్‌ను తానే స్వయంగా ఎదుర్కొన్నానని, బాలీవుడ్‌లో తనకు ఎలాంటి 'గాడ్‌ఫాదర్' లేరని చెప్పింది సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌ల కూతురైన సారా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం స్టార్ కిడ్స్‌పై ఉండే అంచనాల గురించి మనసు విప్పి మాట్లాడింది. తన ఇంటి పేరు ఇండస్ట్రీలోకి ఈజీగా ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే హెల్ప్ అయ్యిందని, కానీ ఇప్పటికీ నెపోటిజం అనే పదాన్ని పట్టుకుని తమ కష్టాన్ని, శ్రమను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఎవరి కడుపున పుట్టాలనేది తమ చేతుల్లో లేదని, స్టార్ హీరో కూతురైనంత మాత్రాన కెరీర్ అంతా పూలబాటేమీ కాదని సారా వెల్లడించింది. ‘నేను సింగిల్ మదర్ పెంపకంలో పెరిగా. నా కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి, కాంట్రాక్టులు మాట్లాడి, అవకాశాల కోసం దర్శకులను వేడుకునే తండ్రి నాకు లేరు’ అని సారా ఎమోషనల్ అయ్యింది. తన ఫస్ట్ మూవీ ‘కేదార్‌నాథ్’ రిలీజ్ టైమ్‌లో సమస్యలు వస్తే తానే ఒంటరిగా పోరాడి పరిష్కరించు కున్నానని, తనకెవరూ సాయం చేయలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది.
‘ఓ స్టార్ కిడ్‌గా ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది.. కెరీర్ మొదలై ఎనిమిదేళ్లు గడుస్తున్నా, ఇంకా మా ప్రతిభను నిరూపించుకుంటూ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం బాధాకరం’ అని సారా చెప్పుకొచ్చింది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన స్పై కామెడీ మూవీ ‘ఉడ్తా తీర్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.
