- ‘ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంబేద్కరిజం పెరిగి మావోయిజం తగ్గిందని రిటెర్డ్ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలతో యువత మావోయిజం వైపు నుంచి దారి మళ్లిందని వెల్లడించారు.మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించడంతోపాటు ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పామన్నారు. ఢిల్లీకి చెందిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్(వీఐఎఫ్) నిపుణులు పీవీ రమణ రచించిన ‘ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ’ అనే పుస్తకాన్ని శివధర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివధర్‌రెడ్డితో పాటు ఏపీ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సహా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా హింసాత్మక భావజాలాన్ని ఎదుర్కోవచ్చన్నారు. సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహన మావోయిస్టు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు, సమ్మిళిత అభివృద్ధి ద్వారా ప్రజలను ప్రగతి వైపు నడిపించవచ్చని తెలిపారు.తిరుమలరావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో నక్సలిజం ప్రారంభమై.. మళ్లీ ఇక్కడ ముగిసిందని అన్నారు. అయినప్పటికీ శాశ్వత శాంతి కోసం నిరంతర అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు.
