- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
న్యూఢిల్లీ, వెలుగు: డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజలను భయపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందే.
విచారణకు ముందే శిక్షించేందుకు చట్టంలో ఏదైనా అవకాశం ఉంటే, దానిని కూడా ఉపయోగించుకోవాలి’ అని బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కమీషన్ల కోసం నిందితులు తమ కంపెనీ బ్యాంక్ అకౌంట్లను మ్యూల్ అకౌంట్లుగా(సైబర్ నేరాల సొమ్మును దాచడానికి) గా అనుమతించిన ఆరోపణలపై దాదాపు 12 రాష్ట్రాల్లో 30 కి పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి.
ఈ కేసులన్నింటినీ ఒకే చోట చేర్చి విచారించాలని నిందితులుగా ఉన్న.. నిధి భండారీ, గౌరబ్ సాహా, పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనతో కూడిన బెంచ్ విచారణ జరిపింది.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు..
సైబర్ నేరాలకు మ్యూల్ అకౌంట్లతో సహకరించారని నిందితులపై తెలంగాణతో పాటు గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తాము సైతం సైబర్ నేరానికి బాధితులమేనని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టుకు నివేదించారు.
తమ కంపెనీ బ్యాంకు అకౌంట్లను తమకు తెలియకుండానే మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించారని, మోసం విషయం తెలిసిన వెంటనే జమ్మూకశ్మీర్ అధికారులకు కంప్లైంట్ చేశామన్నారు. ఢిల్లీలోని మందిర్ మార్గ్ సైబర్ పోలీసు విభాగం ఇప్పటికే నిధుల స్వీకరణ, వాటిని వివిధ ఖాతాల ద్వారా బదిలీ చేయడంపై దర్యాప్తు చేస్తుందని వివరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సమాంతరంగా దర్యాప్తులు కొనసాగితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల కేసులను ఒకచోటకు చేర్చాలని అభ్యర్థించారు. బెంచ్ స్పందిస్తూ.. నిందితుల సౌకర్యం కోసం బాధితుల హక్కులను పక్కనపెట్టలేమని పేర్కొంది.
బాధితులందరినీ ఢిల్లీకి తీసుకురమ్మంటారా?
దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులను నిలిపివేసేందుకు పిటిషనర్లు ఒక సాధనంగా మారకూడదని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంతేకాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న బాధితులందరినీ ఢిల్లీకి తీసుకురావాలా? నిందితులు పెద్ద వ్యక్తుల ప్రలోభాలకు లోనయ్యామని చెబుతున్నారనే కారణంతో దర్యాప్తు విధానాన్ని మార్చమంటారా?’ అని బెంచ్ ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్లను కొట్టివేసింది.
