హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం పేరిట కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. నాడు రాజీవ్ గాంధీ ప్రధాని కావడం సోనియా గాంధీకి ఇష్టం లేదని, నేడు ఆ పదవిని చేపట్టే సత్తా, ప్రజల కోసం పనిచేసే తపన రాహుల్ గాంధీకి ఏకోశానా లేవని బీ విమర్శించారు.
సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ప్రమోషనల్ వీడియోపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పనిచేసే ప్రధానులను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వక పోవడమే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అసలైన కుటిల వైఖరి అని విమర్శించారు. దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తూ అగ్రగామిగా నిలబెడుతున్న ప్రధాని మోదీ తిరుగులేని ప్రజాదరణను గాంధీ కుటుంబం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందని ఆరోపించారు.
