- ఇజ్రాయెల్‌లో అధికార పార్టీకి 54 సీట్లు.. 48 సీట్లతో ప్రతిపక్షం
- మ్యాజిక్ ఫిగర్ 61 సీట్లు.. కొత్త ప్రభుత్వాన్ని తేల్చేది అరబ్ పార్టీలే!
జెరూసలేం: ఇజ్రాయెల్ పార్లమెంట్ (కెసెట్) ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్‌లో ప్రస్తుత ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి పూర్తి మెజారిటీని సాధించలేకపోయింది. రైట్- వింగ్ కొయలిషన్ కేవలం 54 స్థానాలకు పరిమితమైంది. మరోవైపు, మిలటరీ మాజీ చీఫ్ గాడి ఐసెన్‌కోట్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి చేంజ్ బ్లాక్ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అరబ్ పార్టీలు మరో 18 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తున్నది. ఓట్ల లెక్కింపు కొనసాగే కొద్దీ ఈ గణాంకాలు మారవచ్చు. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61సీట్లు అవసరం. ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ దక్కనందున ఇది రాజకీయ ప్రతిష్టంభనకు దారితీసే అవకాశాలున్నాయి. ఇంకా లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
‘లికుడ్’ దేశంలోనే అతిపెద్ద పార్టీ
స్థానిక మీడియా ప్రకారం.. ఇజ్రాయెల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బుధవారం ఉదయం 10.58 గంటల వరకు 76.8% బ్యాలెట్ బాక్సుల లెక్కింపు పూర్తయింది. మంగళవారం ఓటింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌కు, ప్రస్తుత కౌంటింగ్‌కు కొంత తేడా స్పష్టమైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష కూటమికి స్వల్ప ఆధిక్యాన్ని చూపినప్పటికీ.. ఇప్పుడు ఏ పక్షం కూడా మెజారిటీకి దగ్గరగా రాలేదు.
అరబ్ పార్టీల పాత్రే కీలకం
ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారనుంది. కానీ, ప్రభుత్వ ఏర్పాటు కోసం అరబ్ పార్టీల మద్దతు తీసుకోవడానికి నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐసెన్‌కోట్ మాత్రం కొన్ని ప్రత్యేక షరతులకు అంగీకరిస్తేనే అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ రాజకీయ ప్రతిష్టంభన కారణంగా నెతన్యాహు, ఐసెన్కోట్లు కలిసి జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికారిక ఫలితాలు నవంబర్ 4న వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ అన్ని పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. మెజారిటీ సాధించగలరని భావించిన నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ నేతకు 28 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే మరో 2 వారాలు పొడిగిస్తారు. అతను ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే మరొకరికి అవకాశం ఇస్తారు. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే దేశంలో మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
