అచ్చంపేట, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని 100 శాతం సోలార్ గ్రామంగా అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బుధవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో ఇప్పటివరకు 101 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు వివరించారు. మిగిలిన ఇళ్లకు, నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లకు కూడా త్వరగా సోలార్ కనెక్షన్లు అందించాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవన పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, అంగన్‌వాడీలో చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత పోలేపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించి, భూముల వివరాలను పారదర్శకంగా, తప్పులు లేకుండా డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. పర్యటనలో మండల స్థాయి ఆఫీసర్లు, టీజీ రెడ్కో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
