- ఢిల్లీ సభకు రైళ్లు ఇయ్యకపోవడంపై ఆగ్రహం
- తోపులాటలో కిందపడ్డ మహేశ్ గౌడ్, పొన్నం
- మంత్రి పొన్నం ప్రభాకర్ మోకాలికి గాయం
- మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే రైళ్లు ఇస్తలేరని ఫైర్
- ఎన్ని అడ్డంకులు పెట్టినా ఢిల్లీకి పక్కాగా పోతమని వ్యాఖ్య
- బస్సుల్లో 10 వేల మందిని తరలిస్తామన్న పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు:ఢిల్లీలో నవంబర్ 1న జరగనున్న కాంగ్రెస్ సభ కోసం స్పెషల్ రైళ్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయాన్ని ముట్టడించారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి రెండు స్పెషల్ రైళ్లు కావాలని ఈ నెల 22న పీసీసీ నేతలు దరఖాస్తు చేసుకోగా, 27వ తేదీ వరకు కాలయాపన చేసిన రైల్వే అధికారులు చివరి క్షణంలో కుదరదని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు దక్షిణ మధ్య రైల్వే జీఎం వైఖరికి నిరసనగా రైల్ నిలయం ఎదుట బైఠాయించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, నవీన్ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
తోపులాట.. ఉద్రిక్తత
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు అక్కడే బైఠాయించడంతో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మహేశ్ గౌడ్, పొన్నం ప్రభాకర్‌లను అరెస్ట్ చేసే క్రమంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ఇద్దరినీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుంటుండగా వారు మెట్లపై నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. ఈ ఘటనలో పొన్నం ప్రభాకర్ కుడి మోకాలికి స్వల్ప గాయమైంది. అరెస్ట్ చేసిన నేతలను మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు, ఇతర నాయకులు, కార్యకర్తలను రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఢిల్లీ పోవుడు పక్కా
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, అమిత్ షా తీరుపై మండిపడ్డారు. వారిద్దరి సూచనల మేరకే రైళ్లు కేటాయించలేదని, దక్షిణాది నేతలు ఢిల్లీ ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకునేందుకే స్పెషల్ రైళ్లను రద్దు చేశారని ఆరోపించారు. స్పెషల్ రైళ్లు కేటాయించాలని కోరేందుకు రైల్ నిలయం వెళ్తే పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఢిల్లీకి వెళ్తామని, రాంలీలా మైదానంలో తెలంగాణ గొంతు వినిపిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా జన సమీకరణ చేస్తున్నామని, వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో 10 వేల మంది కార్యకర్తలను తరలిస్తామని చెప్పారు.
రైల్వే యాక్ట్ కింద కేసులు?
కాంగ్రెస్ ధర్నా అనంతరం రైల్వే పోలీసులు రైల్ నిలయం చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైల్వే ఆస్తులకు ఏమైనా నష్టం జరిగిందా, రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. దాని ఆధారంగా రైల్వే యాక్ట్ ప్రకారం ఆందోళనకారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
30 గంటల జర్నీ.. యూత్ రావాలె
నవంబర్ 1న ఢిల్లీలో జరగనున్న ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమానికి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కేడర్‌ను తరలించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. స్పెషల్ రైళ్లు ఇవ్వకుండా కేంద్రం కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు. అందుకే కార్యకర్తలకు అవసరమైన మేరకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బస్సు ప్రయాణం 30 గంటలకు పైగా ఉంటుంది కాబట్టి యువకులు వస్తే బాగుంటుందని చెప్పారు. బస్సుల్లో వచ్చేవారికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని, వీటిని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్ పర్యవేక్షిస్తారని తెలిపారు. జూమ్ మీటింగ్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.
