ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల పనితీరుపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్అయ్యారు. బుధవారం ఉదయం ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు టైంకు రావట్లేదని, వచ్చినా రెండు గంటలు కూడా డ్యూటీ చేయకుండా వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. సమయపాలన పాటించని వారిపై చర్యలకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైద్యుల అటెండెన్స్ రిజిస్టర్లను, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని ఓపీ, అత్యవసర విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కొంతమంది డాక్టర్లు టైంకు రావడం లేదని, మరికొన్ని సందర్భాల్లో అసలు విధులకు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో వైద్యులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పలుమార్లు రిక్వెస్ట్చేసినా మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్యులు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యుడు గణేశ్, బీజేపీ నాయకులు ఉన్నారు.
