- ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్
మెదక్/కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో గల్లంతైన తల్లీ, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ కి చెందిన గంగోల్ల సరిత (27), ఆమె కూతుళ్లు వైష్ణవి (7), శ్రావణిక (6) నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఈ నెల 26న తల్లీ, కూతుళ్లు కనిపించడం లేదని ఎల్లారెడ్డి పీఎస్లో కేసు నమోదైంది. సరిత సెల్‌ఫోన్ సిగ్నల్ ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద చూపించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నది ఒడ్డున ముగ్గురి చెప్పులు, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ లభించడంతో అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చీకటి కారణంగా నిలిపివేసిన గాలింపును బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించగా, ముందుగా ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు, ఆ తర్వాత సరిత మృతదేహం లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులే వల్లే..
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సరిత సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. పదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న సరిత భర్త గుండెపోటుతో మరణించడంతో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. తన ఇద్దరు కూతుళ్లను స్వగ్రామంలో తండ్రి బాలకృష్ణ వద్ద ఉంచి చదివిస్తోంది.
దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చిన సరిత, ఆధార్ కార్డులు అప్‌డేట్ చేయించేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి పిల్లలను తీసుకెళ్లింది. ఈ నెల 27న ఏడుపాయలకు చేరుకున్న ఆమె, తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన ఆయన ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
