వెలుగు స్పెషల్ పేజీ : ఎరువుల సబ్సిడీకి డిజిటల్ దన్ను

వెలుగు స్పెషల్ పేజీ : ఎరువుల సబ్సిడీకి డిజిటల్ దన్ను

దేశ వ్యవసాయ రంగంలో ఎరువుల సబ్సిడీ  కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికభారంగా మారుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ముడిసరుకుల ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఈ భారాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ వ్యయం సుమారు రూ.1.77 లక్షల కోట్ల స్థాయిలో ఉండగా,  2026–27లో సుమారు రూ.1.71 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా.  అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కొనసాగితే ఈ భారం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.  ఎరువుల ధరలను  రైతులకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది.  ముఖ్యంగా యూరియాకు అత్యధిక స్థాయిలో సబ్సిడీ లభిస్తోంది.  45 కిలోల యూరియా బస్తాను రైతుకు నిర్ణీత ధరకు అందిస్తూ,  దాని వాస్తవ వ్యయం– రైతు చెల్లించే ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తోంది. మరోవైపు డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువులు, ఎన్‌‌‌‌పీకే వంటి పోషక ఆధారిత ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌‌‌‌బీఎస్) విధానం ద్వారా కేంద్రం రాయితీలు కల్పిస్తోంది.

ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి తెలంగాణలో చేపట్టిన డిజిటల్ విక్రయ విధానం ప్రాధాన్యత సంతరించుకుంది.  గత యాసంగి సీజన్‌‌‌‌లో యూరియా విక్రయాలను డిజిటల్ విధానంలో నిర్వహించిన అనుభవం, ఎరువుల  సరఫరా– పంపిణీపై  మెరుగైన పర్యవేక్షణకు మార్గం చూపింది.  డిజిటల్ విధానం అమలుకు ముందు రైతులు తమకు అవసరమని భావించినన్ని ఎరువుల బస్తాలను నేరుగా డీలర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉండేది.  ఒక్క రైతు ఎంత పరిమాణంలో ఎరువులు కొనుగోలు చేశారనే  సమగ్ర లెక్కలు, పర్యవేక్షణకు అవసరమైన డిజిటల్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఎరువుల విక్రయాలపై సమగ్ర పర్యవేక్షణ  కష్టంగా ఉండేది.  అవసరానికి మించి కొనుగోళ్లు, నిల్వలు,  పునర్విక్రయాలు జరిగే అవకాశం ఉండటంతో అసలు రైతు అవసరాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా ఉండేది.

ఇప్పుడు ప్రతి రైతు కొనుగోలు వివరాలు డిజిటల్‌‌‌‌గా నమోదవుతుండటంతో ఎరువుల వినియోగాన్ని  పర్యవేక్షించడం, అవసరానికి మించి విక్రయాలను నియంత్రించడం సులభమైంది. రైతులు ఇంటినుంచే ఎరువుల కోసం బుకింగ్ చేసుకోవడం,  అందుబాటులో ఉన్న నిల్వలను తెలుసుకోవడం, అవసరమైన సమయంలో ఎరువులను పొందడం కూడా సులభతరమైంది. డిజిటల్ విధానంతో ఎరువుల కొనుగోళ్లపై పర్యవేక్షణ పెరిగి, అక్రమ నిల్వలు, బ్లాక్‌‌‌‌మార్కెటింగ్, అనవసర వినియోగం తగ్గాయి. పంపిణీలో పారదర్శకత పెరగడంతో నిజమైన రైతులకు సకాలంలో ఎరువులు అందుతున్నాయి.  ప్రభుత్వ సబ్సిడీ భారం కూడా తగ్గే అవకాశం ఏర్పడింది.

యూరియాపై అధికంగా ఆధారపడటం ఎందుకు?

ఎరువుల రంగంలో అసలు సమస్య సబ్సిడీ వ్యయం మాత్రమే కాదు.  నత్రజని (N), భాస్వరం (P), పొటాషియం (K) మధ్య సమతుల్యత లేకపోవడం కూడా తీవ్రమైన సమస్యగా మారుతోంది.  సాధారణంగా N:P:K వినియోగ నిష్పత్తి  సుమారు 4:2:1కు  దగ్గరగా ఉండాలని సూచిస్తారు.  కానీ పంజాబ్,  హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో  వరి,  గోధుమ పంటలకు యూరియా, డీఏపీ అధికంగా ఉపయోగించడం వల్ల ఈ నిష్పత్తి తీవ్రంగా మారిపోయింది.  కొన్ని ప్రాంతాల్లో 26:15:1 నుంచి 45:15:1 వరకు నిష్పత్తులు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.  

తెలంగాణలోనూ సమతుల్య ఎరువుల వినియోగం అవసరం ఉంది. రాష్ట్రంలో N:P:K నిష్పత్తి సుమారు 12.6:4.8:1గా ఉంది.  అంటే  ఇక్కడ కూడా పొటాష్  వినియోగం తగిన స్థాయిలో లేదన్నది  స్పష్టమవుతోంది.  అయితే  పొటాష్ ప్రాముఖ్యతపై రైతుల్లో తగిన అవగాహన లేకపోవడం, యూరియా తక్కువ ధరకు లభించడం కూడా ఈ అసమతుల్యతకు కారణాలుగా చెప్పవచ్చు. చవకగా లభించే యూరియాను అధికంగా వినియోగించడం కూడా ఎరువుల వినియోగంలో ఏర్పడిన అసమతుల్యతకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.

చవక యూరియా... ఖరీదైన పరిణామాలు

యూరియా ధర ఇతర ఎరువులతో  పోలిస్తే  చాలా తక్కువ ధరకు లభించడం రైతుకు తక్షణ ప్రయోజనం కలిగించినప్పటికీ,  దీర్ఘకాలంలో నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.  నత్రజని ఎరువులను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల కొన్ని పంటల్లో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది.  దీంతో  రైతులు అదనపు పురుగు మందులు, పంట సంరక్షణ చర్యలపై ఖర్చు చేయాల్సివస్తుంది. ఫలితంగా పంట పెట్టుబడి వ్యయం పెరుగుతుంది.  అంతేకాకుండా రసాయన ఎరువులు,  పురుగుమందులను అతిగా ఉపయోగించడం నేల, నీరు, పర్యావరణంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

చివరికి ఇది ప్రజారోగ్యంతోనూ ముడిపడుతుంది. ఈ నేపథ్యంలో యూరియా ధరను ఇతర ఎరువుల ధరలకు దగ్గరగా తీసుకురావాలనే వాదనకు కొంత ప్రాతిపదిక ఉంది. ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం తగ్గితే రైతులు అవసరానికి అనుగుణంగా ఇతర ఎరువులను కూడా వినియోగించే అవకాశం పెరుగుతుంది.  తద్వారా యూరియాపై అధికంగా  ఆధారపడటం తగ్గవచ్చు. అయితే యూరియా ధరను ఒక్కసారిగా పెంచడం పరిష్కారం కాదు. అది నేరుగా రైతుపై అదనపు భారం మోపే ప్రమాదం ఉంది. కాబట్టి ధరల సంస్కరణలతోపాటు నేల పరీక్ష ఆధారంగా ఎరువుల సిఫార్సులు, రైతులకు పోషక నిర్వహణపై అవగాహన, సమతుల్య ఎరువులకు తగిన ప్రోత్సాహకాలు,  ప్రత్యక్ష రైతు మద్దతు వంటి చర్యలను కూడా అమలు చేయాలి.

డిజిటల్ విక్రయ వ్యవస్థతో శాస్త్రీయ సిఫార్సులను అనుసంధానించాలి

ఎరువుల విక్రయాలను డిజిటల్ చేయడం మంచి సంస్కరణ.  అయితే  ఏ పంటకు ఎంత ఎరువు అవసరం?  నేలలో ఇప్పటికే ఏ పోషకం ఎంత ఉంది? ఏ నిష్పత్తిలో ఎరువులు వేయాలి? అనే అంశాల ఆధారంగా రైతుకు అవసరమైన మేరకే ఎరువులు అందేలా వ్యవస్థను రూపొందించాలి.  నేల పరీక్షలు,  శాస్త్రీయ సిఫార్సులను డిజిటల్ విక్రయ వ్యవస్థతో అనుసంధానిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతు పొలంలో నేల స్వభావం, పోషకాల స్థాయిని గుర్తించి ఆ నివేదిక ఆధారంగా ఎరువుల  సిఫార్సులు,  విక్రయాలను అనుసంధానించాలి. అలా చేస్తే పంటకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందడంతోపాటు, అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితి తగ్గుతుంది. ఫలితంగా రైతు పెట్టుబడి వ్యయం తగ్గుతుంది.  


ప్రభుత్వ సబ్సిడీ రూపంలో వెచ్చిస్తున్న ప్రజాధనం కూడా సమర్థంగా వినియోగించవచ్చు. ‘నేల పరీక్ష–పంట అవసరం–శాస్త్రీయ సిఫార్సు– డిజిటల్ విక్రయం’ అనే సమగ్ర విధానం భవిష్యత్తు ఎరువుల నిర్వహణకు మార్గదర్శకంగా నిలవాలి. డిజిటల్ ఎరువుల విక్రయ వ్యవస్థతోపాటు సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, పరీక్షల విస్తరణ, ధరల సమీక్ష,  రైతు అవగాహన కార్యక్రమాలు కలిసివచ్చినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రజాధనాన్ని ఆదా చేయడం ఎంత ముఖ్యమో, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటం అంతకంటే ముఖ్యమైనది. అదే సమతుల్య వ్యవసాయానికి, స్థిరమైన భవిష్యత్తుకు సరైన దారి.

35 వేల టన్నుల యూరియా తగ్గుదల

తెలంగాణలో గత వానాకాల సీజన్‌‌‌‌తో పోలిస్తే ఈ సీజన్‌‌‌‌లో యూరియా విక్రయాలు సుమారు 35 వేల టన్నుల మేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. దీనిని కేవలం అమ్మకాలు తగ్గడంగా చూడటం సరికాదు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయడం, నిల్వ చేసుకోవడం, బ్లాక్‌‌‌‌మార్కెట్‌‌‌‌కు తరలించడం వంటి అవకాశాలు తగ్గితే ప్రభుత్వ సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. సుమారు 35 వేల టన్నుల యూరియా వినియోగం తగ్గిన నేపథ్యంలో, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 
రూ.210–233 కోట్ల మేర సబ్సిడీ భారం తగ్గే అవకాశం ఉందనే అంచనా గమనార్హం. ఇదే తరహా పారదర్శక వ్యవస్థ దేశవ్యాప్తంగా సమర్థంగా అమలైతే వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక వసతులు, సాగునీరు, పరిశోధన, రైతు సంక్షేమం వంటి రంగాలకు మళ్లించవచ్చు.

- వై.రవితేజ
రాష్ట్ర ఏఈవో సంఘ అధికార ప్రతినిధి

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.