కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ..దీపావళికి ముందే సర్కారు కానుక

కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ..దీపావళికి ముందే సర్కారు కానుక
  •     48 లక్షల ఉద్యోగులు,  68 లక్షల పెన్షనర్లకు లబ్ధి
  •     జులై 1 నుంచే అమల్లోకి తెస్తామన్న కేంద్ర కేబినెట్
  •     కంటైనర్ల తయారీకి రూ.10 వేల కోట్ల స్కీమ్
  •     వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజనకు రూ.7,395 కోట్లు

 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్​న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ముందు కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్ - డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) లను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు  బుధవారం  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ, బేసిక్ పేలో 63 శాతానికి చేరింది. ఇది ఈ ఏడాది జులై 1 నుంచే అమల్లోకి రానుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,016 కోట్లు కేటాయించింది. తద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రోజువారీ గృహ వ్యయాల భారాన్ని తట్టుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక ఊరట దక్కనుంది.  బకాయిలు (అరియర్స్), చెల్లింపుల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించనుంది. 

కంటైనర్ తయారీకి రూ.10 వేల కోట్ల  పథకం

దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చేలా ‘కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్’కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం రూ.10,000 కోట్ల నిధులను కేటాయించారు. ఈ పథకంలో నాలుగు రకాల సదుపాయాలు కల్పిస్తారు. వ్యాపార రుణాలు పొందేందుకు వడ్డీలో రాయితీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కంటైనర్ల నాణ్యతా తనిఖీలు, సర్టిఫికేషన్‌‌‌‌‌‌‌‌కు ఆర్థిక సాయం, తయారీ యూనిట్ల ఏర్పాటుకు భూమిని లీజుకు తీసుకునే ప్రక్రియలో సహకారం, పరిశ్రమల రోజువారీ నిర్వహణ ఖర్చులకు తగిన ప్రోత్సాహకాలు అందించనుంది. 

గ్రామ్ స్వరాజ్ యోజనకు రూ.7,395 కోట్లు

గ్రామీణ ప్రాంతాల్లో పాలనను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ‘పీఎం వికసిత్ గ్రామ్ స్వరాజ్ యోజన’కు కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది. ఈ పథకం అమలు కోసం రూ.7,395 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 4,869.48 కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ. 2,526.07 కోట్లుగా ఉంటుంది. ఈ నిధులతో పంచాయతీల స్థాయి మౌలిక వసతులు పెంపొందించడం, డిజిటల్ సేవల విస్తరణ వేగవంతం కానున్నాయి. దేశవ్యాప్తంగా 2.55 లక్షలకు పైగా పంచాయతీలు, సాంప్రదాయ స్థానిక సంస్థల్లోని దాదాపు 32 లక్షల మంది ఎన్నికైన ప్రతినిధులు, సిబ్బంది, ఇతర భాగస్వాములు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మొత్తంగా పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ సాధికారతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర మంత్రిమండలి ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.