టాటా గ్రూప్ను  నాశనం చేస్తున్నారు: రాహుల్ గాంధీ

టాటా గ్రూప్ను  నాశనం చేస్తున్నారు: రాహుల్ గాంధీ
  • లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

 

 న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌ను కుట్రపూరితంగా నాశనం చేస్తున్నారని లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పరిణామాలపై దేశంలోని వ్యాపారవేత్తలందరూ భయంతో మౌనంగా ఉండిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈమేరకు బుధవారం ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఒక పోస్ట్ పెట్టారు. ‘‘టాటా సంస్థను కుట్రపూరితంగా నాశనం చేస్తున్నారు. కానీ, ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ అంశంపై మాట్లాడేందుకు ధైర్యం చేయడం లేదు. ఇంకెంతకాలం ఈ మౌనం? మిమ్మల్ని కూడా వారు తమ ఆధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా?’’ అని ప్రశ్నించారు. భారతీయ వ్యాపార రంగం అనేది ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ఆటవస్తువు కాదని స్పష్టం చేశారు. వ్యాపారవేత్తలకు మాట్లాడే ధైర్యం లేకపోవచ్చు గానీ తమకు ఉందని, ఈ నేరాలకు వ్యతిరేకంగా కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తేల్చి చెప్పారు.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడికి దిగారు. ‘‘భారతీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు సాధిస్తున్న విజయాలను మీరు పదే పదే అవమానిస్తున్నారు. ఇప్పుడు మన వ్యాపార నాయకులను రెచ్చగొట్టి విష ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారా’’ అని 
మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం భారతీయ పరిశ్రమలను ఉద్యోగ కల్పనకర్తలుగా, ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు.