న్యూఢిల్లీ: క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 137 రకాల నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేసింది. ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ విధానం కింద తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల ధరలు గరిష్టంగా 70 శాతం నుంచి 90 వరకు తగ్గనున్నాయి. క్యాన్సర్ ఔషధాల ధరలు భారీగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రొమ్ము క్యాన్సర్ చికిత్సలో విస్తృతంగా వాడే అనాస్ట్రోజోల్ 10 టాబ్లెట్ల ప్యాక్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 695.76 నుంచి ఏకంగా రూ. 73 కి పడిపోయింది. అజాసిటిడిన్ 100mg ధర రూ.6,337 నుంచి రూ.1,495కు, బేవసిజుమాబ్ 100mg/4ml ధర రూ.21,767 నుంచి రూ.5,930కు, డెబ్రూమాంబ్ 60 mg ధర రూ.22,031 నుంచి రూ.5,941కు, ఫుల్బ్రెకా 5ml వయల్ ధర రూ.26,072 నుంచి రూ5,491కు తగ్గాయి. 2026, నవంబర్ 9వ తేదీన నుంచి దేశవ్యా్ప్తంగా ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, 65 హైకాస్ట్ సింగిల్ సోర్స్ మెడిసిన్స్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
క్యాన్సర్ మందుల ధరలపై సుప్రీం ఫైర్
క్యాన్సర్ మందులను భారీ ధరలకు అమ్మడంపై ఆస్పత్రులు, కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భారీ ధరలను దోపిడీగా పేర్కొంది. ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించింది. ఈ సందర్భంగా భార్య క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ మెడిసిన్ డీలర్‌కు ఎదురైన పరిస్థితిని దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఇంజెక్షన్ విలువ రూ.11వేలేనని డీలర్ చెప్పినా ఆస్పత్రి మాత్రం ఏకంగా రూ.1,30,000 వసూలు చేసింది. రోగుల దగ్గరి నుంచి ఈ దోపిడీని సమర్థించగలరా అంటూ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
