హైదరాబాద్ లోని ఆల్వాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ( అక్టోబర్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గంగా ఎన్‌క్లేవ్‌లోని ఎస్టిలో డివైన్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ దగ్ధమైంది.
అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించడాన్ని గమనించిన నివాసితులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఆల్వాల్ పోలీసులు.
