చందానగర్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. మొత్తం ఐదుగురు, 2025 నుంచి ఇదే పని..!

చందానగర్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. మొత్తం ఐదుగురు, 2025 నుంచి ఇదే పని..!

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2025 డిసెంబర్ నుంచి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వీరిని బుధవారం ( అక్టోబర్ 28 ) అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి దగ్గర నుంచి చోరీకి గురైన రాయల్  ఎన్ఫీల్డ్, కేటీఎం బైకులతో పాటు నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

చందానగర్ హుడా కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అడేపు అజయ్ ఇంటి ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ అక్టోబర్ 25 అర్దరాత్రి చోరీకి గురైందని.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తేలిపారు ఆర్సీ పురం ఏసిపి శ్రీనివాస్. అక్టోబర్ 27న పక్కా సమాచారంతో చందానగర్ MMTS రోడ్డు సమీపంలో ఒక దొంగిలించిన మోటార్ సైకిల్‌ను లాక్కెళ్తుండగా పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న నిందితులు అందరూ ఏపీలోని రాజమండ్రికి చెందినవారుగా గుర్తించినట్లు తేలిపారు. నిందితులు గడ్డం ప్రవీణ్ (21) - బి.టెక్ విద్యార్థి,బురిడి గోపీచంద్ (20)ప్రైవేట్ ఉద్యోగి,చోడవరపు దినేష్ కుమార్ (22) ప్రైవేట్ ఉద్యోగి,గీసల షణ్ముఖ సత్య సాయి (21),సీరపు దినేష్ కుమార్ (22) - విద్యార్థిలుగా గుర్తించినట్లు తేలిపారు.

నిందితులు డిసెంబర్ 2025 నుండి సైబరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో వరుస వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారని.. వీరు కటింగ్ ప్లైయర్లు,స్పానర్లు,స్పేర్ లాక్‌లను ఉపయోగించి హ్యాండిల్, పెట్రోల్ ట్యాంక్ లాక్‌లను తొలగించి బైక్‌లను ఎత్తుకెళ్లేవారని.. అనంతరం నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చి ఆ వాహనాలను రాజమండ్రికి తరలించేవారని తెలిపారు. 

నిందితుల నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (T0926TG2319AT),రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్,రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (TS07GH3172),కేటీఎమ్ 200 డ్యూక్ (TS13EA9889) బైక్ లాకింగ్ పరికరాలు,కటింగ్ ప్లైయర్లు,స్పానర్లు,11 నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు తేలిపారు. మిగిలిన చోరీ వాహనాలను రికవరీ చేయడం కోసం, ఇతర కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.