పిల్లలు చిప్స్, చాక్లెట్లు, ప్యాకెట్ జ్యూస్‌ల పట్ల ఎక్కువగా ఆకర్షితులు కావడానికి కేవలం రుచి మాత్రమే కారణం కాదని, వారి మెదడే దీనికి ప్రధాన కారణమని తాజా పరిశోధనలు వెల్లడించాయి. 'జమా నెట్వర్క్ ఓపెన్' మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ పిల్లల మెదడు పనితీరును ఎలా మారుస్తున్నాయో స్పష్టంగా తెలియజేస్తుంది. జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకునే పిల్లల్లో కలర్‌ఫుల్ ఆహార పదార్థాల ఫొటోలు చూసినప్పుడు మెదడులోని రివార్డ్ సెంటర్ అత్యంత చురుగ్గా మారుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అమెరికాకు చెందిన పరిశోధకులు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్న 46 మంది పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే పిల్లల మెదడులోని 'డోర్సల్ స్ట్రియాటమ్' అనే భాగం మరింత శక్తివంతంగా స్పందిస్తున్నట్లు తేలింది. ఈ భాగమే అలవాట్లను, ఆటోమేటిక్ ఈటింగ్‌ను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ఈ విధంగా మెదడు స్పందించిన పిల్లల్లో ఏడాది వ్యవధిలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI), శరీరంలో కొవ్వు శాతం, నడుము చుట్టుకొలత భారీగా పెరిగినట్లు రీసెర్చ్‌లో వెల్లడైంది.
ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఇతర ఇండస్ట్రియల్ ఫుడ్స్ అన్నీ అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకే వస్తాయి. ఇవి పోషకాలు తక్కువగా.. ఎక్కువ కేలరీలను కలిగి ఉండి పిల్లలను త్వరగా ఆకర్షిస్తాయి. పిల్లలు రోజూ తీసుకునే కేలరీలలో సుమారు 67.7 శాతం మేర ఈ జంక్ ఫుడ్స్ ద్వారానే వస్తున్నట్లు తేలింది. ఈ అధ్యయనం కేవలం ఊబకాయం సమస్యను మాత్రమే కాకుండా.. ఇది ఒక రకమైన 'వ్యసనం'లా మారి పిల్లల మెదడును ఎలా శాసిస్తుందో వైద్య నిపుణులు గుర్తించారు.
ALSO READ : మీ ఇంటి బాల్కనీలో సీతాకోక చిలుకల గార్డెన్ ఇలా తయారు చేసుకోవచ్చు..!
భారతదేశంలోనూ ప్యాకేజ్డ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్ వాడకం విపరీతంగా పెరగడం వల్ల చిన్నతనంలోనే ఊబకాయం సమస్య పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ పిల్లలకు వీటిని తినవద్దని చెప్పడం, వ్యాయామం చేయమనడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని వారు అంటున్నారు. దీనికోసం స్కూళ్లలో కఠినమైన ఆహార విధానాలను అమలు చేయడం, అనారోగ్యకరమైన ఆహార ప్రకటనలను నియంత్రించడం.. సంప్రదాయ, ప్రాసెస్ చేయని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
