మాడ్రిడ్: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హై స్పీడ్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో దాదాపు40 మంది ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. టోలెడో ప్రావిన్స్‌లోని మాడ్రిడ్-అండలూసియా మార్గంలో బుధవారం (అక్టోబర్ 28) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
మాడ్రిడ్-అండలూసియా హై-స్పీడ్ రైలు మార్గంలో దక్షిణం వైపు వెళ్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని రెన్ఫే ఏవీఈ రైలు పట్టాలపై నిలిచి ఉన్న ఇరియో రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇర్యో రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం సమయంలో రెన్ఫే రైలులో 397 మంది ప్రయాణికులు, ఇర్యో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నారు.
సమాచారం అందుకున్న రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలు, బోగీల శిథిలాలు, క్షతగాత్రుల ఆర్తనాధాలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్-అండలూసియా హై-స్పీడ్ రైలు మార్గంలో రైలు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కూడా ఇదే మార్గంలో రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కార్డోబా ప్రావిన్స్‌లోని అడముజ్ సమీపంలో ఒక రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొనడంతో 46 మంది మరణించారు. తాజాగా మళ్లీ ఇదే రూట్లో ప్రమాదం జరగడంతో రైల్వే మౌలిక సదుపాయాలు, నిర్వహణపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
